కొద్దిరోజులు నాన్-వెజ్‌కు దూరంగా ఉండాల్సిందేనా..?

By అంజి  Published on  13 Feb 2020 4:01 AM GMT
కొద్దిరోజులు నాన్-వెజ్‌కు దూరంగా ఉండాల్సిందేనా..?

ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో విపరీతమైన వదంతులు కూడా పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో సాధారణ జనం కూడా నాన్-వెజ్ కు దూరంగా ఉంటే చాలా మంచిదని భావిస్తున్నారు. తణుకు టౌన్ లో విపరీతంగా వదంతులు వ్యాప్తి చెందడంతో 'నాన్-వెజ్ బంద్' అంటూ మెసేజీలు వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రబలడానికి మాంసాహారమే కారణమని భావిస్తున్న ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వర రావు మంగళవారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ 'నో నాన్ వెజ్ వీక్' అని చెప్పారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని కోళ్ల ఫామ్ లలో కోళ్లు చనిపోతూ ఉన్నాయని.. కొద్దిరోజులు ప్రజలు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఒక్క చికెన్ మాత్రమే కాకుండా మటన్, బీఫ్, పోర్క్ లాంటి మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మార్కెట్ లో అందుబాటులో ఉన్న మాంసంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కారుమూరి వెంకట నాగేశ్వర రావు కోరారు. అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో ఎక్కువ సంఖ్యలో కోళ్ల ఫారంలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాన్ వెజ్ కు ప్రజలు దూరంగా ఉండడంతో పెద్ద ఎత్తున నష్టపోయే అవాకాశం ఉంది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సగటున ఐదు లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. ఆదివారం, సెలవు దినాల్లో ఇది రెండింతలు ఉంటుంది. పండుగ రోజుల్లో మూడింతల విక్రయాలు జరుగుతుంటాయి. ఈ విక్రయాలు ఇప్పుడు సగానికిపైగా పడిపోయాయి. కోళ్ల ఫామ్ ఓనర్లు చనిపోయిన కోళ్లను పాతి పెట్టడం, పలు ప్రాంతాల్లో పడేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చికెన్ విక్రయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 50 శాతానికి విక్రయాలు దిగజారినట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధర కూడా కొన్ని ప్రాంతాల్లో సగానికి పైగా తగ్గిపోయిందని చెబుతున్నారు. నిజా నిజాలు తెలుసుకోకుండా కరోనా వైరస్ కోళ్లకు సోకుతోంది అనే వదంతులు నమ్మిన చాలా మంది చికెన్ ను దూరం పెట్టారు.

Next Story