సొంత రాష్ట్రాల‌కు వెళ్లేందుకు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2020 3:34 PM GMT
సొంత రాష్ట్రాల‌కు వెళ్లేందుకు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించింది. దీంతో ఇత‌ర రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. అలాంటి వారికి కేంద్రం శుభ‌వార్త చెప్పింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థులు, ప‌ర్యాట‌కుల‌ను వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చ‌డంపై బుధ‌వారం కేంద్ర హోంశాఖ ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. రెండు రాష్ట్రాల అనుమతితో వారి ప్రయాణాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

త‌ర‌లింపులో భాగంగా అన్ని రాష్ట్రాలు నోడ‌ల్ అధికారుల‌ను నియంమించుకొని చిక్కుకుపోయిన వారి వివ‌రాలు సేక‌రించాల‌ని సూచించింది. ప్ర‌యాణించే వారికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశాకే సొంత రాష్ట్రాల్లోకి అనుమ‌తించాల‌ని, సొంత రాష్ట్రాలకు చేరుకోగానే హోం క్వారంటైన్‌లో పెట్టాలని ఆదేశించింది. త‌ర‌లించే స‌మ‌యంలో భౌతిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. బ‌స్సుల‌ను ఒక గ్రూపులా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల‌ని.. బ‌య‌లు దేరే ముందు అన్ని బ‌స్సుల‌ను శానిటైజ్ చేయాల‌ని తెలిపింది. వారిని త‌ర‌లించే మార్గాల‌పై ఇరు రాష్ట్రాలు స‌మ‌న్వ‌యం చేసుకుని చివ‌రి ప్ర‌దేశం వ‌ర‌కు వెళ్లేలా ఆయా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళుతున్న వారిని ఆరోగ్య సేతు యాప్ ద్వారా పర్యవేక్షించాలని, వారందరినీ ఆ యాప్‌తో అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.

Next Story