పాఠం చెప్పండి సారూ.. చాలు!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  1 Aug 2020 2:17 PM GMT
పాఠం చెప్పండి సారూ.. చాలు!

విద్యార్థుల్లో ప్రేరణను ప్రోది చేసేవారే ఉత్తమ ఉపాధ్యాయులు అంటారు. ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నాడు టీచర్స్‌ డే ఆచరిస్తున్నాం. మన పూర్వీకులు కూడా గురువులేని విద్య గురుతుగా దొరకదని అన్నారు. మంచి టీచర్‌ ఎదురైతే చాలు విద్యార్థి జీవితంలో సగం విజయం లభించినట్లే అంటారు. అయితే ఇవన్నీ చెప్పడానికే గానీ ఆచరణలో అమలు కావడం లేదన్నది నిష్ఠురసత్యం. అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే పాఠాలు తప్ప అనే పరిస్థితి ఏర్పడటానికి ప్రభుత్వాలు సగం కారణం అని కొందరంటున్నారు. ఈ తీరును మార్చడానికే నూతన విద్యావిధానంలో విద్యార్థుల విషయంగానే కాదు ఉపాధ్యాయుల విషయంగానూ అనేక సంస్కరణలు రావాలని సూచించారు. అమలు చేయడమే మిగిలింది.

టీచర్లకు అసలు పనికంటే అదనపు పనులే అధికం. స్కూల్లో మధ్యాహ్న భోజన పర్యవేక్షణ మొదలు, జనాభా లెక్కలు, ఎన్నికలు, ఇతర ఏ పథకాల సర్వే పనులు అయినా సరే ప్రభుత్వాలకు వెంటనే గుర్తొచ్చేది టీచర్లే! పాఠాలు చెప్పడం మినహా మిగిలిన పనులన్నీ చక్కగా చేయించుకునేవి. కొందరు టీచర్లు మనసులో గొణుక్కొన్నా చాలామంది ఈ విధానానికి అలవాటు పడిపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన నూతన విద్యా విధానంలో టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని సుస్పష్టంగా తెలిపింది. పాలనా పరమైన ఏ పనులనూ టీచర్లకు అప్పగించరాదని, వారిని బోధనకే పరిమితం చేయాలని వివరించింది.

విద్యావిధానంలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చినా... వాస్తవంలో ఇది అమలవుతుందా అన్నది అనుమానమే. 2010లో అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టంలోనూ టీచర్లకు వేరే పనులు వద్దని చెప్పినా ఏమైంది.. ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు. డిప్యుటేషన్‌ పేరిట డీఈవో కార్యాలయంలో టీచర్లుంటున్నా ఎవరూ వద్దనలేదు. చివరికి ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళాక ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలుగా వ్యవహరిస్తున్న టీచర్లు మళ్లీ బడిబాట పట్టారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం లెక్కల పనులు తమకు వద్దు మొర్రో అంటున్నా ప్రభుత్వం బలవంతంగా అప్పగించే దుస్థితి. చాలా జడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్ళలో ఇప్పటికీ ఇదే తంతు కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ కొత్తనిబంధనను విద్యాశాఖ ఎంతమేరకు అమలు చేస్తుందో తేలాలి.

విద్యార్థులకే కాదు పాఠాలు బోధించే టీచర్లకు కూడా నైపుణ్యాలు మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉందని నూతన విద్యావిధానం అంటోంది. రానున్న కాలంలో అర్హతలతోపాటు నైపుణ్యాలున్న వారికే పెద్దపీట వేయాలని ఈ విధానం చెబుతోంది. టీచర్లు నిరంతరం తమ విద్యా నైపుణ్యాలను పదును పెట్టుకునేలా కంటిన్యుయస్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ (సీపీడీ) అమలు చేయనుంది. టీచర్లు స్థానికంగా, రాష్ట్రీయంగా, జాతీయస్థాయుల్లో జరిగే వివిధ వర్క్‌ షాపుల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్నది కొత్త విద్యావిధానం సూచన. నైపుణ్యాభివృద్ధికి ఆన్‌లైన్‌ సాంకేతికతను వినియోగించుకోవాలని ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు ఏర్పాటుచేయాలని తెలిపింది.

ప్రతి టీచర్‌ ఏడాదిలో కనీసం 50 సీపీడీ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిబంధన రూపొందించింది. అంతేకాదు ప్రభావాత్మకంగా పనిచేసే టీచర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా తెలిపింది. వారి కెరీర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బాగా పనిచేసేవారికి పదోన్నతులు కల్పించాలని చెప్పింది. సమీక్షలు, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్, కమిట్‌మెంట్, సీపీడీలో పాల్గొన్న వ్యవధి తదితరాంశాలను రికార్డు చేయాలంది. ఉత్తమ పనితీరు కనబరిచిన టీచర్లకు అకడమిక్‌ లీడర్‌షిప్‌ ఇచ్చేందుకు తగిన శిక్షణ ఇవ్వాల్సిందిగా పేర్కొంది. ఈ అంశాలు కచ్చితంగా అమలు చేయగలిగితే ఉత్తమ టీచర్లు తయారవడమే కాదు.. విద్యార్థుల తీరు కచ్చితంగా మారిపోతుంది.

Next Story
Share it