అదుపు తప్పిన అంబులెన్స్.. ముగ్గురి మృతి
By అంజి Published on 25 Jan 2020 7:06 PM IST
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం రాచర్లపాడు నేషనల్ హైవేపై ఇస్కో కిసాన్ వద్ద అదుపు తప్పిన అంబులెన్స్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్ ఎం.వినయ్ నిద్ర మత్తులోకి జారడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతులు డ్రైవర్ వినయ్ (21), ఎ.విక్టర్(65), తిలోమణి (80) నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులైన మహిళను హైవే అంబులెన్స్ సిబ్బంది దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై టి.శ్రీనివాసులు రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నుంచి బిట్రగుంటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాగా కడప జిల్లా వేముల గ్రామంలో కూలీలతో వెళ్తున్న ఆటోను హైచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిద్ధగురుపల్లి గ్రామానికి ఆటోలో కూలీలు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.