'దసరా'.. అనాథలకు ఆసరా

By మధుసూదనరావు రామదుర్గం  Published on  23 Aug 2020 3:26 PM IST
దసరా.. అనాథలకు ఆసరా

ఆదుకోవడం చాలా అద్భుతమై పదం. ఎదుటి మనిషి అవసరాల్లో ఆదుకుంటే వారు జీవితాంతం గర్తుపెట్టుకుంటారు. సాయం చేసిన మనిషిని తమ ఆత్మబంధువులా గుండెకు హత్తుకుంటారు. నీరానుండే ఈ సత్యం తెలుసుకుంది తన తల్లి నుంచి. కెనడాలో స్థిరపడ్డ ఇంజనీర్‌ దంపతులకు జన్మించిన నీరా నుండేకు సామాజిక సేవలంటే చాలా ఇష్టం. నీరా తల్లి ఆదివాసీల కోసం ఖరగ్‌పూర్‌ సమీపంలో ఓ గురుకులాన్ని ప్రారంభించారు. ఆ గురుకులంలో వందలాది మంది చదువుకునే వారు. ఆదివాసీల జీవితంలో మార్పు తీసుకురావాలని ఆమె నిరంతరం పాటుపడేవారు. అయితే వారిని నిధుల కొరత నిత్యం వేధించేది. గురుకులాన్ని నిర్వహించాలన్న తాపత్రయం ఉన్నా.. అందుకు సరిపడా నిధులు లభించేవి కావు.

కెనాడాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నీరా హార్వర్డ్‌లో ఎంబీయే ముగించారు. ఆ తర్వాత మోర్గాన్‌ స్టాన్లీలో బ్యాంకర్‌గా సేవలందించారు. అంతకు ముందు నీరా తన ఎంబీయే కోర్సులో భాగంగా భారత్‌లో మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు చేరారు. కుగ్రామాల్లో కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తున్నా సంస్థ నిధుల కోసం సతమతమవుతున్న తీరును నిశితంగా గమనించారు. ఆ సమయంలోనే తన బ్యాంకింగ్, మేనేజిమెంట్‌ నైపుణ్యాలను ఉపయోగించి సంస్థలకు నిధులు సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్న్‌షిప్‌ తర్వాత అమెరికాకు వెళ్ళిన నీరా తన చదువు కోసం తీసుకున్న రుణం తీర్చుకోడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ గా పనిచేశారు. అప్పు తీరాక భారత్‌కు రావాలని అప్పుడే నిర్ణయిచుకున్నారు.

మోర్గాన్‌ స్టాన్లీలో పనిచేస్తున్నప్పుడే నీరాకు దేవల్‌ సంఘ్వీతో పరిచయం ఏర్పడింది. దేవల్‌ కూడా భారత్‌లో ఓ స్వచ్ఛంద సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండటంతో వీరిద్దరి ఆలోచనలు కలిశాయి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్ళిదాకా దారితీసింది. భారత్‌లోని పేద మహిళలు, పిల్లల కోసం శ్రమించే స్వచ్ఛంద సంస్థలకు, లాభాపేక్షలేని ఎన్జీవోలకు నిధులు సమకూర్చాలని ఆలోచించారు. దీనికి తగినట్టుగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తయారు చేసుకుని వారు తమ మిత్రులకు చూపించారు.

మిత్రులు వారి ఆలోచనల్ని మెచ్చుకుని తోచినంత విరాళాలు ఇచ్చారు. ఆ మొత్తం రూ.40వేలు కావడంతో, మరిన్ని విరాళాలు సేకరించాలని ముందుకు సాగారు. మోర్గాన్‌ స్టాన్లీ ఛైర్మన్‌ బి. ఫిషర్‌ను కలిశారు. అతను వీరి ఆలోచనలకు ఉత్తేజితుడై దాతృత్య కార్యక్రమాలకు విరాళాలివ్వాలని నాకు ఎప్పటినుంచో ఆలోచన ఉండేది. అది మీనుంచే ఎందుకు ప్రారంభించరాదని అంటూ కోటిరూపాయల చెక్‌ ఇచ్చారు.

అంతేకాదు ప్రతి ఏటా రూ.35 లక్షలు చొప్పున అయిదేళ్లు ఇస్తానని మాట ఇచ్చారు. నీరా,దేవల్‌ సంతోషానికి హద్దుల్లేవు. తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్న నమ్మకం వారికి కుదిరింది. ఆ భరోసాతోనే ఇండియాకు వచ్చి 1999 లోదసరా అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. మ్యాజిక్‌ బస్, విల్‌ గ్రో లాంటి సంస్థలకు విరాళాలిచ్చారు.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇక మనల్ని పట్టేవారెవరు? నీరా, దేవల్‌ విషయంలోనూ అదే జరిగింది. 2002లో ఫిషర్‌ మరణిచంచడంతో నిధులు ఆగిపోయాయి. మరో దాత మిలియన్‌ డాలర్లు ఇస్తానని మొదట్లో మాటిచ్చినా డాట్‌కామ్‌ దెబ్బతినడంతో చేతులెత్తేశారు. ఈ చేదు అనుభవాలు వారికి చాలా పాఠాలు నేర్పాయి.

దాతల నుంచి విరాళాలను వ్యూహా త్మకంగా సేకరించే విధానాన్ని అలవరచుకున్నారు. సేవారంగంలో కృషి చేస్తున్న ఏన్జీవోలను విరాళాల రూపంగా ఆదుకుంటే.. అవి తమ సేవల్ని విస్తృతం చేస్తాయని, లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని వివరించేవారు. అయితే చెప్పినప్పుడు శ్రద్ధగా విన్న వారు ఆ తర్వాత తమ స్పందనను తెలియజేస్తామనే వారు. ఆ తర్వాత అనేది ఏడాదో రెండేళ్ళో ...అంతవరకూ నిరీక్షించక తప్పని పరిస్థితి. కొన్ని సార్లు ఓపికతో ఎదురుచూసినా చివరికి పెదవి విరుపులే దక్కేవి.

చేదు ఘటనలు పెరుగుతున్నప్పుడల్లా మనసును నిబ్బరపరచుకోవడం అలవాటు చేసుకున్నారు. కార్పొరేట్‌ సంస్థలతోపాటు హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీల్లో విరాళాల సేకరణ కోసం తరచూ సందర్శించేవారు. వీటితోపాటు గేట్స్‌ ఫౌండేషన్‌ నుంచి ప్రస్తుతం విరాళాలు సేకరిస్తున్నారు. గత పదేళ్ళలో లాభాపేక్ష లేని 800 స్వచ్ఛంద సంస్థలకు బాసటగా నిలిచారు.

ప్రస్తుతం లెర్న్‌ ఎ హ్యండ్, స్నేహ, ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ తదితర సంస్థలతో పనిచేస్తున్నారు. దసరా సంస్థ ద్వరా రూ.500 కోట్ల విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందిస్తున్నారు. ఆశయం మంచిదైనపుడు లక్ష్య మార్గం సులభంగా ఉంటుంది. అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించడంలో పరిణతి కావాలి. అది తనలో పుష్కలంగా ఉందంటారు నీరా నుండే!!

Next Story