నెల సంపాదన రూ.14వేలు.. ఆమె బ్యాంకుఖాతాలో మాత్రం రూ.200 కోట్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 4:43 AM GMT
నెల సంపాదన రూ.14వేలు.. ఆమె బ్యాంకుఖాతాలో మాత్రం రూ.200 కోట్లు

ఆమె ఒక సాదాసీదా మహిళ. ఈ మాట ఇప్పటివరకూ చాలామంది నమ్మేవారు. కానీ.. అసలు విషయం తెలిసినంతనే అవాక్కు కావటమే కాదు.. ముందు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. నెలకు కేవలం రూ.14వేలు మాత్రమే ఆదాయం అంటూ పేద మాటల్ని చెప్పే ఆ మహిళ బ్యాంకు ఖాతాలో దగ్గర దగ్గర రూ.200 కోట్లు ఉండటంతో అధికారులు అవాక్కు అవుతున్నారు. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటారా? అక్కడికే వస్తున్నాం.

దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన రేణు తరణికి హెచ్ఎస్‌బీసీ జెనీవా బ్రాంచులో ఖాతా ఉంది. తరణి ఫ్యామిలీ ట్రస్ట్ పేరుతో ఉన్న ఖాతాకు తరణి లబ్థిదారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ముంబయిలో నివిసించే ఆమె 2005-06లో ఐటీ శాఖకు ఆమె ఫైల్ చేసిన రిటర్న్స్ లో తనకున్న బ్యాంకు ఖాతాను వెల్లడించలేదు. అంతేకాదు.. అదే ఏడాది తన వార్షిక ఆదాయం రూ.1.7లక్షలుగా మాత్రమే పేర్కొన్నారు.

తనది బెంగళూరు అని.. తాను ముంబయిలో ఉన్నట్లుగా చెప్పుకున్నారు. తాను క్రమం తప్పకుండా ఆదాయపన్ను కడుతున్నట్లుగా పేర్కొన్నారు. అలాంటి ఆమె ఖాతాకు సంబంధించి అనుమానం వచ్చిన అధికారులు తీగ లాగితేడొంక మొత్తం కదిలింది. అధికారుల్ని అవాక్కు అయ్యేలా చేసింది. ఆమె పేరుతో జెనీవాలో ఉన్న హెచ్ఎస్‌బీసీ బ్రాంచ్ లో ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అడిగితే తనకుఎలాంటి ఖాతా లేదన్నారు.

అంతేకాదు.. తాను ఎన్ఆర్ఐనని.. తన బ్యాంకుఖాతాలో డబ్బులు ఉన్నా.. వాటికి తాను డబ్బులు చెల్లించనని పేర్కొన్నారు. దీంతో.. అనుమానం వచ్చిన అధికారులు మరింత లోతుగా విచారించటం మొదలు పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆమె బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.196 కోట్ల మొత్తం ఉన్నట్లు గుర్తించారు. చాలా తక్కువ వ్యవధిలో ఇంత భారీ మొత్తం ఆమె ఖాతాలో ఎలా జమ అయ్యిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఆమె ప్రముఖురాలు కాకపోవటం.. ఎలాంటి చారిటీ నిర్వహించకపోవటం లాంటివేమీ చేయకున్నా తక్కువ సమయంలో అంత భారీ మొత్తం ఆమె ఖాతాలో చేరటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఒక సామాన్యురాలి బ్యాంకు ఖాతాలో రూ.200 కోట్లు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story