ప‌డ్న‌విస్‌కు 'ప‌వ‌ర్' పంచ్ : అజిత్‌ పవార్‌ రాజీనామా

By అంజి  Published on  26 Nov 2019 3:05 PM IST
ప‌డ్న‌విస్‌కు ప‌వ‌ర్ పంచ్ : అజిత్‌ పవార్‌ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. అనుహ్యరీతిలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రేపు శాసనసభ బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అజిత్‌ పవార్‌పై కుటుంబ సభ్యులు, ఎన్సీపీ నేతలు తీవ్ర ఒత్తిడికి తీసుకువచ్చారని సమాచారం. బలనిరూపణకు ముందే ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. శాసనసభలో సీఎం ఫడ్నవీస్‌ తన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నవంబర్‌ 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓపెన్‌ బ్యాలెట్‌ ద్వారానే ఫ్లోర్ టెస్ట్‌ నిర్వహించాలని, బలపరీక్ష ప్రక్రియ మొత్తం ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

Next Story