వృద్ధులను వేధిస్తే.. ఊచలు లెక్కపెట్టాల్సిందే..!
By అంజి Published on 12 Dec 2019 9:20 AM ISTముఖ్యాంశాలు
- వృద్ధుల సంరక్షణ బిల్లుకు సవరణలు
- వృద్ధులను దూషిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా
- వృద్ధులు తమ జీవనం కోసం పోషణ ఖర్చును అడిగే హక్కు
- అల్లుడు, కోడలును పిల్లల కిందకి తీసుకువస్తూ సవరణ బిల్లు
- లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి తావర్‌చంద్ గెహ్లోత్
ఢిల్లీ: కేంద్రప్రభుత్వం మరో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వృద్ధులను వేధింపులకు గురి చేసినా, దుర్భాషలాడినా, వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా లేదంటే రెండు విధించేలా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బుధవారం కేంద్రమంత్రి తావర్‌చంద్ గెహ్లోత్ 'తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్ సిటిజన్ల చట్టం-2007' సవరణ బిల్లను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు ప్రకారం వృద్ధులు తమ జీవనం కోసం పోషణ ఖర్చును అడిగే హక్కుంటుంది. వృద్ధులను శారీరకంగా, ఆర్థికంగా, ఉద్వేగపూరితంగా, మానసికంగా వేధిస్తే పిల్లలకు శిక్ష తప్పదు. వృద్ధులను సంరక్షణ సమయంలో పట్టించుకోకపోవడం కూడా వేధింపుల కిందకే వస్తుంది. వృద్ధాశ్రమ సంస్థలు రిజిస్ట్రేషన్, నిర్దేశిత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. వృద్ధులకు సొంత కొడుకు కూతురుతో పాటు దత్తత సంతానం, సవతి పిల్లలు, మనుమలు, మనువరాళ్లు, అల్లుడు, కోడలు సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి.
వృద్ధులు, తల్లిదండ్రులు, పెద్దల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ట్రైబ్యునల్ 60 రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. పైన చెప్పిన విధంగా.. ఏ రకం వేధింపులకు గురి చేసిన వృద్ధులు ఈ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. అప్పుడుప్పుడు 60 రోజుల గడువును మరో 30 రోజులకు పెంచే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్ సిటిజన్ల చట్టం బిల్లు ప్రకారం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఓ ఏఎస్సైని వృద్ధుల సమస్యల పరిష్కారం కోసం నియమించాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీస్ విభాగం ఉండాలి. దీనికి డీఎస్పీ లేదా ఆ పైస్థాయి అధికారులు బాధ్యతలను పర్యవేక్షిస్తారు. వృద్ధులు, తల్లిదండ్రులు తమ సమస్యలను చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంరక్షణ అధికారిని నియమించాలి.
ప్రస్తుతం భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమవుతుండడతో వృద్ధులపై, తల్లిదండ్రులపై నిర్లక్ష్యం, వారిని పట్టించుకోకపోవడం ఎక్కువైపోయిందని బిల్లులో పేర్కొన్నారు. 'తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్ సిటిజన్ల చట్టం-2007' చట్టాన్ని సమీక్షించాలని పలు హైకోర్టులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. తాజాగా అల్లుడు, కోడలును పిల్లల పరిధిలోకి తీసుకురావాంటూ అందిన విజ్ఞప్తుల ఆధారంగా కేంద్రప్రభుత్వం ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. అంతకుముందు సీనియర్ సిటిజన్ల చట్టంలోని నిబంధనలను కార్యదర్శుల బృందం సమీక్షించింది. తల్లిదండ్రులు గౌరవంగా బ్రతికేలా వారి పిల్లలు చూసుకోవాలని తెలిపింది.