జార్ఖండ్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభం

By అంజి  Published on  30 Nov 2019 3:55 AM GMT
జార్ఖండ్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభం

జార్ఖండ్ లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం ఏడు గంటల నుంచే తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. అయిదు విడతలుగా జరుగుతున్న ఈ పోలింగ్ లో హర్యాణా, మహారాష్ట్రల నిరాశాజనకమైన ప్రదర్శన తరువాత పరువు దక్కించుకునేందుకు బిజెపి, మరో సమ్మెట పోటు వేసేందుకు విపక్షాలు పోరాడుతున్నాయి.

తొలి దశలో ఆరు జిల్లాల్లోని పదమూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం బిశ్రామ్ పూర్, ఛతర్ పూర్, మానికా, లతేహర్, పాంకీ, డాల్టన్ గంజ్, హుసేనాబాద్, ఛత్రా, గుమ్లా, గఢ్వా, బిషున్ పూర్, లోహర్ దగా, భవనాథ్ పూర్ లలో వోటింగ్ జరుగుతుంది.

మొత్తం 3906 పోలింగ్ స్టేషన్లలో వోటింగ్ జరుగుతుంది. ఈ దశలో 189 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం వోటర్లు 37,83,055 కాగా అందులో 18,01,356 మహిళలు ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3.గంటలకు ముగుస్తుంది.

జార్ఖండ్ లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తున్నది. దాని మాజీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది. మరో వైపు విపక్ష కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్ జే డీలు కూటమిగా పోరాడుతున్నాయి. మహారాష్ట్ర, హర్యాణా ఫలితాలు, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో బిజెపి వైఫల్యాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నందున ఇవి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తొలి దశలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రామచంద్ర చంద్రవంశీ, పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరావ్ లు ఉన్నారు. ప్రభుత్వ పనితీరు, నక్సల్ హింస, వలసలు, మూక దాడులు, నిరుద్యోగం వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలు.

Next Story