కేసు నమోదు చేసిన జొమాటో డెలివరీ బాయ్.. పరారైన యువతి..?

Zomato row: After delivery boy Kamaraj files FIR, Hitesha Chandranee flees Bengaluru. డెలివరీ బాయ్‌ తనను కొట్టాడని ఆరోపించిన యువతి హితేషా చంద్రాణి బెంగళూరు నుంచి పారిపోయినట్లు కథనాలు

By Medi Samrat  Published on  17 March 2021 11:20 AM GMT
Zomato row: After delivery boy  Kamaraj files FIR, Hitesha Chandranee flees Bengaluru
జొమాటో వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెలివరీ బాయ్‌ తనను కొట్టాడని ఆరోపించిన యువతి హితేషా చంద్రాణి బెంగళూరు నుంచి పారిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. డెలివరీ బాయ్‌ కామరాజ్‌ చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమెని విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కోరారు. కానీ ఆమె ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని.. మహారాష్ట్ర వెళ్లానని చెప్పినట్లు తెలుస్తోంది. కామరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేం చంద్రాణి మీద కేసు నమోదు చేశామని.. విచారణకు రావాల్సిందిగా కోరగా.. ఆమె ప్రస్తుతం నేను సిటీలో లేను.. మహారాష్ట్రలోని మా బంధువుల ఇంటికి వెళ్లానని బదులిచ్చిందని చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. బెంగళూరు వచ్చాక విచారణ​కు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఒకవేళ చంద్రాణి విచారణకు హాజరు కాకపోతే ఆమెను అరెస్ట్‌ చేస్తామని అన్నారు.


యువతి-జొమాటో డెలివరీ బాయ్‌ల మధ్య వివాదానికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇద్దరి తరపున వాదనలు మీడియా ముందుకు వచ్చాయి. ఫుడ్‌ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్‌ దాడి చేశాడని డెలివరీ బాయ్‌ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ మీద విడుదలైన కామరాజ్‌ సదరు యువతిపై కేసు పెట్టాడు. కామరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. యువతిపై ఎలాంటి దాడి చేయలేదని.. డెలివరీ ఆలస్యం అయినందుకు నేను ఆమెకు క్షమాపణలు కూడా చెప్పానని కామరాజ్ తెలిపాడు.

ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయినందున ఫుడ్‌ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరానని.. కానీ ఆమె అంగీకరించలేదని చెప్పుకొచ్చాడు కామరాజ్. నన్ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. నా మీదకు షూ విసిరిందని.. ఈ క్రమంలో అనుకోకుండా తనను తానే గాయపర్చుకుందని వెల్లడించాడు. చివరకు నేను ఆమెపై దాడి చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఆమె నన్ను అసభ్య పదజాలంతో దూషించి.. అవమానించిందని.. అందుకే ఆమెపై కేసు పెట్టానని అన్నాడు. కామరాజ్ గత 26 నెలలుగా జొమాటోలో పని చేస్తున్నాడని.. తను అందించిన సేవలకు గానూ 4.75/5 రేటింగ్‌ పొందినట్లు తెలుస్తోంది.

ముందు నేను డెలివరీ బాయ్‌ను తిట్టలేదు. ఫస్ట్‌ అతనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ భయంలో, కంగారులో నేను అతడిని తిట్టాను. అంతే తప్ప కావాలని అతడిని దూషించలేదు.. అవమానించలేదని యువతి అంటోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.


Next Story