ఉద్యోగం లేద‌ని కుంగిపోలేదు.. బిడ్డ‌ను చూసుకుంటూ ప‌ని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!

నేడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. డెలివ‌రీ చేసేవాళ్లు కూడా పెర‌గారు.

By Kalasani Durgapraveen  Published on  18 Nov 2024 5:37 AM GMT
ఉద్యోగం లేద‌ని కుంగిపోలేదు.. బిడ్డ‌ను చూసుకుంటూ ప‌ని ఎలా చేసుకోవాలో ఆలోచించింది..!

నేడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. డెలివ‌రీ చేసేవాళ్లు కూడా పెర‌గారు. అయితే.. మ‌న‌లో కొద్దిమంది మాత్రమే ఆ డెలివరీ ఏజెంట్ల గురించి ఆలోచిస్తారు.. ట్రాఫిక్‌తో పోరాడడం నుండి వాతావరణ పరిస్థితులను భరించడం వరకూ ప్రతిరోజూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటీవల.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక తల్లి తన బిడ్డతో ఇంటింటికీ తిరిగి ఆహారం డెలివ‌రీ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన వీడియో.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఫుడ్ డెలివరీ చేసే మహిళది. వీడియో క్లిప్‌లో.. వెనుక భాగంలో జోమాటో డెలివరీ బాక్స్‌తో బైక్‌ను నడుపుతుండగా.. ఆమె బిడ్డ తన ముందు కూర్చుని ఉంది. ఈ క్లిప్.. తన బిడ్డతో తల్లి చేసే జీవ‌న‌ పోరాటాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.

ఆ మ‌హిళ డెలివరీ పార్టనర్‌గా నెల రోజులుగా పని చేస్తోంది. తాను కూడా హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థినేనని వెల్లడించింది. పెళ్లయ్యాక ఉద్యోగం సంపాదించడం కష్టమైపోయింది. ప్రధానంగా పిల్లలతో పని నిర్వహించడం సవాలే. దీంతో కొడుకు బాగోగులు చూసుకుంటూ భోజనం పంపిణీ చేసే పనికి శ్రీకారం చుట్టిన‌ట్లు పేర్కొంది.

ఆమె తన విద్యార్హ‌త‌లు తెలుపుతూ.. నేను చాలా చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నించాను.. కానీ నాకు ఒక బిడ్డ ఉంది అని నన్ను తిరస్కరించారు.. అప్పుడు నేను అనుకున్నాను.. నాకు బైక్ ఉంది.. ఈ ప‌నిలో నేను నా బిడ్డను ద‌గ్గ‌ర ఉంచుకుని పని చేసుకోవ‌చ్చ‌ని ఆమె వివరించింది.

మీ ఉద్యోగం మీకు కష్టంగా ఉందా అని మహిళను అడ‌గ‌గా.. మహిళ గట్టిగా సమాధానం ఇచ్చింది. "మొదట్లో ఇబ్బందులు ఉన్నాయి.. కానీ ఇప్పుడు.. నాకు అది సవాలుగా అనిపించలేదు అని ఆమె బదులిచ్చింది.

Next Story