చార్ ధామ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో, ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులకు ఆరోగ్యానికి సంబంధించి కీలక సలహాను జారీ చేసింది. తమ ప్రయాణాలను ప్రారంభించే ముందు నడక, శ్వాస సంబంధిత వ్యాయామాలు, గుండె సంబంధిత వ్యాయామాలను చేయాలని సలహా ఇచ్చింది.
చార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ లకు వెళుతూ ఉంటారు. ఈ తీర్థయాత్ర స్థలాలన్నీ ఎత్తైన హిమాలయ ప్రాంతంలో, సముద్ర మట్టానికి 3,000 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నందున, యాత్రికులు తరచుగా తీవ్రమైన చలి, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. అధికారిక రికార్డుల ప్రకారం, గత సంవత్సరం యాత్ర సమయంలో 246 మంది యాత్రికులు ఆరోగ్య కారణాల వల్ల మరణించారు. 2023లో 242 మరణాలు సంభవించాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రీల్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లపై నిషేధాన్ని విధిస్తున్నారు. కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలతో వీడియోలు తీస్తూ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసే వారికి దర్శనాన్ని నిరాకరించి తిరిగి పంపించేయనున్నారు. కేదార్‌నాథ్ ఆలయానికి 30 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కెమెరాలను నిషేధించాలని ఆలయ కమిటీ ఆదేశించింది. ఏ భక్తుడు కూడా సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ క్రియేట్ చేయకుండా ఉండేందుకు దీనిని అమలు చేయనున్నారు. ఏప్రిల్ 30 (అక్షయ తృతీయ) నుండి గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. మే 2న, కేదార్‌నాథ్ తలుపులు తెరవనున్నారు, తరువాత మే 4న బద్రీనాథ్ తలుపులు తెరుస్తారు.