ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. రూ.2 కోట్లు ఇవ్వ‌కుంటే..

లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. యూట్యూబర్‌ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్‌ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది

By Kalasani Durgapraveen  Published on  18 Nov 2024 3:24 PM IST
ఈసారి యూట్యూబర్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌.. రూ.2 కోట్లు ఇవ్వ‌కుంటే..

లారెన్స్ బిష్ణోయ్ పేరుతో యూట్యూబర్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. యూట్యూబర్‌ సౌరభ్ జోషి నుండి ఆ గ్యాంగ్‌ 2 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసింది. రూ.2 కోట్లు ఇవ్వకుంటే కుటుంబంలోని ఓ వ్యక్తి ప్రాణాలైనా కోల్పోవాల్సి వస్తుందని ఆయన ఇంటికి లేఖ పంపారు. తాను హల్ద్వానీలోని రాంపూర్ రోడ్‌లోని ఒలివియా కాలనీలో నివాసముంటున్నట్లు యూట్యూబర్ సౌరభ్ జోషి పోలీసులకు తెలిపారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖలో నన్ను, నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు.

లేఖ పంపిన వ్యక్తి ఇలా వ్రాశాడు.. “హలో మిస్టర్ సౌరవ్ జోషి, నేను కరణ్ భిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి.. మీకు ముఖ్యమైన సమాచారం అందించడానికి ఈ లేఖ పంపాను. మా గ్యాంగ్‌కి రెండు కోట్ల రూపాయల నగదు ఇవ్వాలని మా బాస్ లారెన్స్ బిష్ణోయ్ ఆదేశించారు. మీరు నగదు చెల్లించకపోతే, మిమ్మల్ని లేదా మీ కుటుంబ సభ్యులను చంపాలని ఆదేశించారు. మీ సమాధానం కోసం మేము ఐదు రోజులు వేచి ఉంటాము. మీరు ఎలాంటి సమాధానం ఇవ్వకుంటే లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించ‌డం లేదా మీ కుటుంబంలో కాకుండా ఇతరులతో ఈ విషయాన్ని ప్ర‌స్తావిస్తే.. మీ కుటుంబం నుండి ఒక సభ్యుడు ప్రాణాలు కోల్పోతారు. మేము మీ సమాధానం కోసం వేచి చూస్తాం. మీరు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రార్థిస్తాం. ఒక తప్పు అడుగు మీ కుటుంబం ప్రాణాలను బలిగొంటుంది. కాబట్టి.. మీరు మాతో మాట్లాడాలనుకుంటే మా Instagram IDని ఇస్తున్నామని.. చివర్లో జై మహాకాల్ అని రాశారు.

ఈ బెదిరింపు కారణంగా నేను, నా కుటుంబ భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నానని సౌరభ్ జోషి చెప్పాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులను బెదిరించి వసూళ్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్వాల్ రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు.

Next Story