పాకిస్థాన్‌కు గూఢచర్య చేస్తుందనే ఆరోపణ నేపథ్యంలో అరెస్టయిన హర్యాన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హర్యానా పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంప్రదింపులు జరిపారనే విషయం స్పష్టమైనట్లు వెల్లడించారు. అయితే ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేగాక, సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని హిస్సార్ ఎస్పీ వెల్లడించారు.
ఈ సందర్భంగా హిస్సార్ ఎస్పీ మాట్లాడుతూ... ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను మేం గుర్తించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవు. ఇక, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గానీ, మతం మార్చుకోవాలని అనుకున్నట్లు గానీ నిర్ధరించే పత్రాలేవీ మాకు దొరకలేదు. అయితే, ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ.. జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారు. జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వీసా ఏజెంట్ హర్కిరత్ సింగ్ కు చెందిన రెండు మొబైల్ ఫోన్లలో డేటా రిట్రైవ్ చేసేందుకు లాబ్‌కు పంపామని ఎస్పీ పేర్కొన్నారు.