నిజమైన ప్రేమ అంటే ఇదేనా,..! ప్రియురాలి మృతదేహానికి తాళికట్టిన యువకుడు
Youth in Assam marries dead girlfriend.ఓవ్యక్తి మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదని తెలిసి తట్టుకోలేకపోయాడు
By తోట వంశీ కుమార్ Published on 20 Nov 2022 2:44 AM GMTప్రేమ.. ఇదో అందమైన అనుభూతి. కొందరు ప్రేమ పేరుతో తమ శారీరక అవసరాలు తీర్చుకుని ముఖం చాటేస్తున్నారు. అయితే.. ఓవ్యక్తి మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదని తెలిసి తట్టుకోలేకపోయాడు. తనతో జీవితం పంచుకోలేకపోయినా కనీసం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మృతదేహానికి తాళి కట్టాడు. అంతేనా..? ఇక జీవితంలో ఎవ్వరిని పెళ్లి చేసుకోనని, ఒంటరిగానే ఉంటానని మృతదేహం వద్ద ప్రతిజ్ఞ చేశాడు.
అస్సాంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోని ఆనందంగా జీవించాలని కలలు కన్నారు. అయితే.. ప్రాథనా బోరా ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె మరణాన్ని బిటుపన్ తట్టుకోలేకపోయాడు. తననే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ప్రాథనా మృతదేహానికి తాళి కట్టాడు. ఇక జీవితంలో ఎవ్వరిని పెళ్లి చేసుకోనని, ఒంటరిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు.
"పార్థనా కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యం పాలైంది. గౌహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, మేము ఆమెను రక్షించలేకపోయాము. ఆమె శుక్రవారం రాత్రి మరణించింది" అని ఆమె బంధువులలో ఒకరైన సుబోన్ బోరా చెప్పారు.
"బిటుపన్ వచ్చినప్పుడు.. అతను ఆమెను వివాహం చేసుకోబోతున్నానని చెప్పాడు. ఇది మా ఊహకు అందనిది. ఎవరైనా నా సోదరిని ఇంత గాఢంగా ప్రేమిస్తారని మేము కలలో కూడా ఊహించలేదు. మేము అతనిని ఆపడానికి ప్రయత్నించలేకపోయాము.అతను ఏడుస్తూ అంత్యక్రియల ఏర్పాట్లు చేశాడు. నా సోదరి నిజంగా అదృష్టవంతురాలు. ఆమెబిటుపన్ ను వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆ వ్యక్తి ఆమె చివరి కోరికను నెరవేర్చాడు. " అని ప్రార్థన యొక్క కజిన్ సోదరుడు సుభోన్ తెలిపాడు.
బిటుపన్ చేసిన పనికి స్థానికులతో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.