ఐఏఎస్ అధికారిణి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. 'ఫ్రీ అంటే కండోమ్‌లు కూడా కావాలంటారు'

'You'll Want Condoms Too' Bihar Officer's Shocker To Girl's Sanitary Pads Question.ఓ మ‌హిళా ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్య‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sept 2022 10:34 AM IST
ఐఏఎస్ అధికారిణి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. ఫ్రీ అంటే కండోమ్‌లు కూడా కావాలంటారు

ఓ మ‌హిళా ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. ఫ్రీగా ఇస్తే కండోములు కూడా కావాలంటారు' అంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విద్యార్థినుల‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లే'దు. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో జ‌రిగింది.

పాట్నాలో విద్యార్థులతో 'శశక్త్ బేటీ.. సమృద్ధ్ బీహార్' పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బీహార్ విమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్‌జోత్ కౌర్ హాజ‌రైయ్యారు. అనంత‌రం ఆమె మాట్లాడుతుండ‌గా.. ఓ విద్యార్థిని క‌ల్పించుకుని ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు, సైకిళ్లు వంటివి ఇస్తోంది. వారి కోసం ఇంత ఖ‌ర్చు చేస్తున్న ప్ర‌భుత్వం రూ.20 నుంచి రూ.30 విలువ చేసే శానిట‌రీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా ఇవ్వ‌లేదా అని ప్ర‌శ్నించింది.

విద్యార్థిని అడిగిన ప్ర‌శ్న‌పై హర్‌జోత్ కౌర్ తీవ్రంగా స్పందించింది. కోరిక‌ల‌కు ఓ అంతు అనేది ఉందా..? అని గ‌ద్దిస్తూనే ఈ రోజు రుతు రుమాళ్లు(శానిట‌రీ నాప్‌కిన్స్‌) ఉచితంగా అడుగుతున్నారు. ఇలాగే ఇచ్చుకుంటూ పోతే.. చివ‌ర‌కు కుటుంబ నియంత్ర‌ణ కోసం కండోమ్‌ల‌ను కూడా ఉచితంగా ఇవ్వాలంటారు అని వ్యాఖ్యానించింది. హర్‌జోత్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్క‌డ ఉన్న అమ్మాయిలు బిత్త‌ర‌పోయారు. వెంట‌నే తేరుకున్న అనంత‌రం ఓట్ల కోసం వ‌చ్చిన‌ప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు క‌దా..? అని ఓ విద్యార్థిని నిల‌దీసింది. ఈ ప్ర‌శ్న‌కు అయితే.. ఓట్లు వేయ‌కండి పాకిస్థాన్ లా మారిపోండి అని హర్‌జోత్ కౌర్ విద్యార్థినుల‌పై మండిప‌డ్డారు.

త‌న పాఠ‌శాల‌లో బాలిక‌ల మ‌రుగుదొడ్డి విరిగిపోయింద‌ని, అబ్బాయిలు త‌రుచుగా లోప‌లికి ప్ర‌వేశిస్తార‌ని ఓ విద్యార్థిని చెప్ప‌గా.. చెప్పండి, మీకు ఇంట్లో ప్ర‌త్యేక మ‌రుగుదొడ్లు ఉన్నాయా..? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. హర్‌జోత్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ బాధ్యాతాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలాంటివి వ్యాఖ్య‌లు స‌బ‌బు కాద‌ని కామెంట్లు పెడుతున్నారు.

Next Story