గుడ్లు, చికెన్ తిన‌క‌పోతే మీరు చాలా మిస్ అవుతారు..!

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పోరుకు తెరపడింది. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు అల్పాహార విందు సమావేశం నిర్వహించారు.

By -  అంజి
Published on : 3 Dec 2025 10:45 AM IST

eggs, chicken, Karnataka, CM Siddaramaiah, pure vegetarian reporter

గుడ్లు, చికెన్ తిన‌క‌పోతే మీరు చాలా మిస్ అవుతారు..! 

కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం పదవిపై పోరుకు తెరపడింది. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు అల్పాహార విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఐక్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని పేర్కొన్నారు.

అల్పాహార విందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్కడే ఉన్న మహిళా జర్నలిస్టుతో మాట్లాడుతూ.. మీరు స్వచ్ఛమైన శాఖాహారులైతే, మీరు ఖచ్చితంగా జీవితంలో చాలా కోల్పోతారని అన్నారు.

వాస్తవానికి అల్పాహార విందు సంద‌ర్భంగా సిద్ధరామయ్య.. మీకు చికెన్ అంటే ఇష్టమా అని మహిళా జర్నలిస్టును అడిగారు.. దానికి జర్నలిస్ట్ తాను ప్యూర్ శాఖాహారిని అని చెప్పారు. దీనిపై సీఎం ప్యూర్ అంటే ఏంటని ప్రశ్నించారు. మీరు గుడ్లు కూడా తినరా.? అయితే.. జీవితంలో మీరు చాలా మిస్ అవుతున్నారని సీఎం అన్నారు. ఈ సంభాషణ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో అల్పాహార విందు సందర్భంగా జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సదాశివనగర్‌లోని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ నివాసానికి చేరుకున్నారు, అక్కడ శివకుమార్, అతని సోదరుడు డికె సురేష్ ఆయనకు స్వాగతం పలికారు.

అంతర్గత విభేదాల ఊహాగానాల మధ్య ఐక్యతను ప్రదర్శించేందుకు కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. తాము అన్నదమ్ములమని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు.

మెనూ ప్రకారం.. అల్పాహారంలో శాఖాహారం, మాంసాహార వంటకాలు ఏర్పాటుచేశారు. డీకే శివకుమార్‌కు శాఖాహార వంటకాలు వడ్డించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోసం.. నాటు కోడి(దేశీ చికెన్) ను శివకుమార్ భార్య ఉష సాంప్రదాయ మైసూర్ పద్ధతిలో వండారు. ఇది కాకుండా.. మెనులో వివిధ ర‌కాల వంట‌లు ఉన్నాయి.

Next Story