కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దీంతో లాక్ డౌన్ ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొద్దిరోజుల కిందట కర్ణాటక ప్రభుత్వానికి ఆ యోచన లేనప్పటికీ గత వారం రోజులుగా పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతోనే అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నట్లు తెలిపింది. పరిస్థితి చేజారే వరకూ వస్తే లాక్‌డౌన్ విధించక తప్పకపోవచ్చని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తాజాగా స్పష్టం చేశారు.
బెంగళూరు లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కరోనా కేసుల్లో తగ్గుదల కనిపించడం లేదు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నట్లు కన్నడ మీడియా చెబుతోంది. ఏప్రిల్ 17న బెళగావి లోక్‌సభ, మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిసిన అనంతరం లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని అంటున్నారు. ఏప్రిల్ 18 లేదంటే 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటక లోని నగరాల్లో ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవ్వకుంటే 20వ తేదీ నుంచి పది రోజులపాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.