దేశ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం : ప్రధాని మోదీ
World will now see India as more safe from Covid-19.కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రారంభించిన వ్యాక్సినేషన్
By తోట వంశీ కుమార్ Published on 22 Oct 2021 11:19 AM ISTకరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారతదేశం అక్టోబర్ 21(గురువారం) వరకు 100 కోట్ల టీకా డోసుల వినియోగించిన దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతి నుద్దేశించి ప్రసంగించారు. వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని.. దేశ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమన్నారు. కఠిన పరిస్థితుల్లో భారత్ ఓ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు తెలిపారు. ఈ ఘనత దేశంలోని ప్రతి ఒక్కరికి చెందుతుందన్నారు. వీఐపీ సంస్కృతికి తావు లేకుండా.. దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా టీకా పంపిణీ చేశామన్నారు.
భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొనసాగిందన్నారు. కరోనా వ్యాక్సిన్ల ద్వారా భారత శక్తి ఏంటో ప్రపంచానికి చూపించామన్నారు. మన ఫార్మా సామర్థ్యం ప్రపంచానికి మరోసారి తెలిసిందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మొదట్లో చాలా భయాందోళనలు వ్యక్తం అయ్యాయని.. భారత్ లాంటి పెద్ద దేశంలో టీకా క్రమశిక్షణ ఎలా సాధ్యం అవుతుందని విమర్శించారని మోదీ గుర్తు చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్‌తోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు.
ఇంకా కరోనా ముప్పు తొలగిపోలేదని.. ప్రతి ఒక్కరూ ఇప్పటికి జాగ్రత్తలు పాటించాల్సిందేనని ప్రధాని చెప్పారు. బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో.. అంతే సాధారణంగా మాస్క్ కూడా ధరించాలన్నారు. దీపావళి పండుగను ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలన్నారు. ఇంత వరకు ఒక్క డోసు కూడా తీసుకోని వారికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణులతో పాటు విదేశీ నిపుణులు కూడా సానుకూలంగా ఉన్నారని.. దేశానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. యువత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.