18 మందిని పెళ్లిచేసుకుంది.. న‌గ‌ల‌తో ప‌రారైంది.. చివ‌రికి..!

Women who married 18 men arrested.పెళ్లికాని అబ్బాయిల‌కు గాలం వేసేది. న‌మ్మించి పెళ్లి చేసుకోనేది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2021 4:32 AM GMT
Women who married 18 men arrested

పెళ్లికాని అబ్బాయిల‌కు గాలం వేసేది. న‌మ్మించి పెళ్లి చేసుకోనేది. అనంత‌రం డ‌బ్బు, న‌గ‌ల‌తో అక్క‌డి నుంచి ఉడాయించేది. ఇలా ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 18 మంది యువ‌కుల‌ను మోసం చేసింది. చివరికి రాజస్థాన్‌ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. పెళ్లి చేసుకుని డ‌బ్బు, న‌గ‌ల‌తో ప‌రారుకావ‌డం భాగ్‌వతి అలియాస్ అంజలికి వెన్నతో పెట్టిన విద్య. తెలుగు రాష్ట్రాలకు చెందినట్టుగా భావిస్తున్న అంజలి మరో ఐదుగురితో కలిసి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో పలువురిని మోసగించింది.

జునాగఢ్‌ పరిధిలో ఉండే అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడింది అంజలి. అనంత‌రం య‌ధా ప్ర‌కారం నగలు, మూడు లక్షల రూపాయల నగదుతో పరారైంది. ఆమె కోసం వెతికిన‌ప్ప‌టికి ప్ర‌యోజనం లేకుండా పోయింది. దీంతో తాను మోస‌పోయిన‌ట్లు తెలుసుకున్న ఆ యువ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మారు పేరు, నకిలీ ధ్రువ పత్రాలతో ఆమె గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అంజలితోపాటు మరో ఐదుగురిని కటకటాల వెనక్కి పంపారు. అంజ‌లి, ఆమె త‌ల్లి ధ‌నుబెన్‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించ‌గా.. 18 మంది యువ‌కులను ఇలాగే మోసం చేసిన‌ట్లు చెప్ప‌డంలో పోలీసులే షాక‌య్యారు.


Next Story
Share it