ప్రపంచం అంతా కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక వ్యాక్సిన్ వేయడంలో అలసత్వం వద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికి కొందరు కింది స్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తాజాగా ఓ నర్సు చేసిన పని వైద్యవర్గాలకే తలవంపులు తెచ్చేలా ఉంది. ఫోన్‌లో మాట్లాడుతూ.. ఓ మహిళకు రెండు సార్లు కరోనా టీకా ఇచ్చింది. ఇదేం అని ఆ మహిళ ప్రశ్నించగా.. సదరు మహిళను బెదిరించింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా అక్బర్‌పూర్ ప్రాంతానికి చెందిన కమలేశ్ కుమారి (50) అనే మహిళ కరోనా టీకా వేసుకునేందుకు మర్హౌలీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఏఎన్‌ఎం విధులు నిర్వహిస్తోంది. అర్చన అనే నర్సు ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉంది. ఓ వైపు ఫోన్‌లో మాట్లాడుతూనే పరధ్యానంలో కమలేశ్‌కు రెండు సార్లు టీకా ఇచ్చింది. దీన్ని గమనించిన కమలేశ్ ఆమెను ప్రశ్నించగా.. అర్చన క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఆమెనే దబాయించి తిట్టి పోసింది. వెంటనే ఈ విషయాన్ని కమలేశ్ కుమారి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.
వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు, ప్రధాన వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన వారు వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఒకేసారి రెండు టీకాలు ఇవ్వడంతో తనకేమన్నా అవుతుందేమోనని కమలేశ్ కుమారి ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కమలేశ్‌లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. టీకా వేసిన దగ్గర స్వల్పంగా ఉబ్బిందని వెల్లడించారు.