గోవాకు వెళ్దామని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. విడాకులు కోరిన భార్య
ఓ భర్త తన భార్యను హనీమూన్‌కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు.
By అంజి Published on 25 Jan 2024 7:33 AM GMTగోవాకు వెళ్దామని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. విడాకులు కోరిన భార్య
ఓ భర్త తన భార్యను హనీమూన్‌కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే భార్య తన భర్త నుంచి విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. ఫ్రీ ప్రెస్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఈ జంట హిందూ తీర్థయాత్రల పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, కేసు శుక్రవారం ఫ్యామిలీ కోర్టుకు చేరుకుంది. తన భర్త ఐటీ రంగంలో పనిచేస్తున్నాడని, బాగా సంపాదిస్తున్నాడని విడాకుల పిటిషన్‌లో మహిళ పేర్కొంది. హనీమూన్‌కు విదేశాలకు వెళ్దామని భర్తను భార్య కోరింది. అయితే, తన భర్త తన తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లేందుకు నిరాకరించాడని మహిళ పేర్కొంది. బదులుగా, వారు భారతదేశంలోని ఒక స్థలాన్ని సందర్శించాలని అనుకున్నారు. దీంతో గోవాకు వెళ్దామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.
గోవా, సౌత్ ఇండియా పర్యటనకు భార్య అంగీకరించింది. అయితే తర్వాత భర్త ఆమెకు సమాచారం ఇవ్వకుండా అయోధ్య, వారణాసికి విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. జనవరి 22న జరిగే రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు తన తల్లి నగరాన్ని సందర్శించాలని కోరుకోవడంతో తాము అయోధ్యకు వెళ్తున్నామని యాత్రకు ఒకరోజు ముందు చెప్పాడు. ఆ సమయంలో మహిళ ఫిర్యాదు చేయకపోవడంతో యాత్రకు ముందుకు వెళ్లింది. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త తన కంటే కుటుంబ సభ్యులను ఎక్కువగా చూసుకుంటున్నాడని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది.