గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరి పొలానికి మరొకరు వెళ్లకుండా ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలా చేయడం వలన తామేదో సాధించేశామని అనుకుంటూ ఉంటారు కొందరు. ఇలాంటి వాటి వలన గొడవలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ మహిళ భూమి దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు.. ఆమె భూమి దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేయడంతో ఆమె ఏకంగా రాష్ట్రపతి దగ్గరకు తన సమస్యను తీసుకుని వెళ్ళింది. నాకొక హెలీకాఫ్టర్ ఇప్పిస్తే భూమి దగ్గరకు వెళతానని.. అందుకు లోన్ కావాలంటూ లెటర్ రాసింది.
తనకు లోన్ ఇప్పిస్తే, ఓ హెలికాప్టర్ కొనుక్కుంటానని రాష్ట్రపతికి మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ లేఖ రాసింది. మాండ్ సౌర్ జిల్లా, లోహర్ కు చెందిన బసంతీ బాయ్ అనే మహిళకు రెండు ఎకరాల పొలం ఉంది. ఆ ఊరి ఆసామి ఒకరికి ఆ పొలం పక్కనే భూమి ఉండటంతో బసంతీ రాయ్ తన పొలంలోకి వెళ్లే మార్గాన్ని మూసేశాడు. తనకు న్యాయం చేయాలని ఆమె ఎంతో కాలం పాటు అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఫలితం కనిపించలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. తనకు ఓ హెలికాప్టర్ కావాలని, దాన్ని కొనేందుకు రుణం ఇప్పించాలని కోరింది. ఈ విషయం మీడియాలో కూడా రావడంతో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. ఆమెకు.. ఆమె పొలంలోకి వెళ్లేందుకు దారిని ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.