విజయం సాధించడం గొప్ప కాదు.. తాము సాధించిన విజయాన్ని ఇతరులు కూడా తమదిగా భావిస్తే అదే గొప్ప..! ఇక భార్యాభర్తలు అన్నాక ఒకరి విజయం తమ విజయంగా భావిస్తూ ఉంటారు. అలా ఆమె భర్త విజయం సాధించగానే భుజాల మీద మోసుకుంటూ మరీ వెళ్లి తిప్పింది.
మహారాష్ట్రలోని పూణేలో జరిగిందీ ఘటన. పూణే జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సోమవారం ఎన్నికల ఫలితాలు రాగా, ఖేడ్ తాలూకాలోని 'పలు' అనే గ్రామానికి సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇక ఆనందంతో భార్య రేణుక.. అతడిని భుజాలపై ఎక్కించుకుని ఊరేగించింది.
కరోనా కారణంగా విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడంపై కలెక్టర్ నిషేధం విధించారు. సంబరాల్లో ఐదుగురి కంటే ఎక్కువమంది కనిపించకూడదని ఆంక్షలు విధించారు. అలాగే భౌతికదూరం తప్పనిసరని పేర్కొన్నారు. దీంతో భర్తను భుజంపై మోస్తూ కేవలం ఐదుగురితోనే రేణుక సంబరాలు చేసుకుంది. భర్తను భుజాలపై మోస్తూ సంబరాలు చేసుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కువ మంది జనంతో సంబరాలు చేసుకుంటే ఆ ఊరికే పరిమితం అయ్యేవారేమో.. ఇప్పుడు దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా భార్యలను ఎత్తుకునే భర్తలను చూశాం కానీ.. ఇలా భర్తను భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్లే మహిళను చూడడం చాలా అరుదు..!