ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కిన మహిళ.. చివరికి ఏమైందంటే.?
బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కడం మహిళల సేఫ్టీకి సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 6:41 PM ISTబెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కడం మహిళల సేఫ్టీకి సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది. ఓలా డ్రైవర్‌గా నటిస్తూ ఒక వ్యక్తి బెంగళూరుకు చెందిన మహిళను దాదాపుగా కిడ్నాప్ చేశాడు. వృత్తిరీత్యా వైద్యురాలైన నికితా మాలిక్‌ను పోలీసులు రక్షించారు. తనను తాను బసవరాజ్ అని పరిచయం చేసుకున్న 'క్యాబ్ డ్రైవర్' తనను ఎలా మోసం చేశాడనే విషయాన్ని ఆమె ఎక్స్‌లో పంచుకున్నారు. 112 కి కాల్ చేయకపోయి ఉండి ఉంటే తాను ఈరోజు ట్విట్టర్ లో ఈ విషయం చెప్పే దాన్ని కాదేమోనని ఆమె తెలిపింది.
ఇంటికి తిరిగి వెళ్ళడానికి రాత్రి 10:30 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు మాలిక్ తెలిపారు. ఆమెను బసవరాజు కాంటాక్ట్ చేశాడు. అయితే కారుకు వేరే నంబర్ ప్లేట్ ఉంది. నిర్దేశించిన ఓలా క్యాబ్ పికప్ బే వద్ద ఉండగా ఆమె కారు తనకు కేటాయించినదేనని భావించి, ఏమీ అనుమానించకుండా లోపల కూర్చుంది. బసవరాజు OTP నంబర్‌ను అడగలేదు. బదులుగా Google Mapsలో ఆమె గమ్యాన్ని చెప్పమని అడిగాడు. OTP నంబర్ ఇస్తాను అని చెప్పగా.. అతను Ola యాప్ లోపాలను ఎదుర్కొంటూ ఉందంటూ సమాధానం ఇచ్చాడు.
ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే డ్రైవర్ బుకింగ్ సమయంలో చూపించిన దానికంటే ఎక్కువ ధరను డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో, డ్రైవర్ ఆమెను వేరే కారులో వెళ్ళమని సూచించాడు. క్షణాల్లో బుకింగ్ సమయంలో తన కోసం కేటాయించిన ఓలా క్యాబ్ ఇది కాదని మహిళ గుర్తించింది. ఎక్కడ పడితే అక్కడ డ్రాప్ చేయొద్దు తిరిగి విమానాశ్రయంలో దింపాలని కోరింది నికితా మాలిక్. అయినా బసవరాజ్ పట్టించుకోకుండా బెదిరించడం మొదలుపెట్టాడు. పెట్రోలు బంకు వద్ద ఆగినప్పుడు ఇంధనం కోసం రూ.500 డిమాండ్ చేశాడు.
ఆమె వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112కి డయల్ చేసి, కారు, నంబర్ ప్లేట్ చిత్రాన్ని తీసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. మాలిక్ కాల్‌పై స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకుని బసవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.