సాధారణంగా మనుషులు తప్పు చేస్తే న్యాయస్థానాలు శిక్షలు విధిస్తుంటాయి. అయితే.. ఓ కోతి చేసిన నేరానికి జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తోంది. ఓ బోనులో బంధిగా ఉన్న కోతి ఇటీవలే ఐదేళ్ల శిక్షను పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కోతిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఇది ఇక జీవితాంతం బోనులోనే ఉండాల్సిందే.
వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్‌లో ఓ మాంత్రికుడి వద్ద కాలియా అనే పేరుగల కోతి ఉండేది. ఆ కోతికి అతడు మద్యం, మాంసం అలవాటు చేశాడు. వీటికి అది బానిసగా మారిపోయింది. కొన్నేళ్ల క్రితం ఆ మాంత్రికుడు మరణించాడు. దీంతో కాలియా ఆలనా పాలనా చూసేవారు కరవయ్యారు. మందు, మాంసానికి అలవాటుపడిన కోతి జనాలపై దాడులకు పాల్పడేది.
మద్యం దుకాణాల వద్ద మందుబాబుల చేతిలో ఉన్న మందుసీసాలు, గ్లాసులు లాక్కొని వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లేది. ఇలా ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 250 మందికి పైగా కోతి దాడిలో గాయపడ్డారు. వీరిలో ఓ వ్యక్తి మరణించారు. 2017లో స్థానికులు దీనిపై ఫిర్యాదు చేయగా.. అటవీ అధికారులు అతి కష్టం మీద పట్టుకున్నారు. అప్పటి నుంచి జూలో బందీగా ఉంచి వైద్యం కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ఐదేళ్లుగా పైగా చికిత్స అందించినప్పటికీ ఈ కోతిలో ఎలాంటి మార్పు రాలేదు.
దీంతో ఈ కోతిని జీవితాంతం జూలోనే బందీగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.