దుబాయ్ ఎయిర్ షోలో ప్రాక్టీస్ సమయంలో స్వదేశీ తయారీ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (34) అమరుడయ్యాడు. ఈ ఘటన నిన్న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన ఈ తేలికపాటి యుద్ధ విమానం (LCA) వైమానిక విన్యాసాలు చేస్తుండగా అదుపు తప్పింది. తక్కువ ఎత్తులో చేసిన ఓ క్లిష్టమైన విన్యాసం నుంచి విమానాన్ని పైలట్ తిరిగి నియంత్రణలోకి తేలేకపోయారని వీడియోలను బట్టి తెలుస్తోంది. విమానం నేలను ఢీకొట్టడానికి ముందు పైలట్ బయటకు దూకే ప్రయత్నం చేయలేదని సమాచారం.
మరణించిన వింగ్ కమాండర్ నమన్ష్ సయాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందినవారు. ఆయన తండ్రి భారత సైన్యంలో పనిచేసి, విద్యాశాఖలో ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. నమన్ష్‌కు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా భారత వైమానిక దళంలో అధికారిణిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒక శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆమె కోల్ కతాలో ఉన్నారు.
దేశం ధైర్యవంతుడు, అంకితభావం కలిగిన పైలట్‌ను కోల్పోయిందని ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వింగ్ కమాండర్ సియాల్ ధైర్యం, దేశం పట్ల అచంచల నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని, దుఃఖిస్తున్న కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి తెలిపారు.