లగేజీ బ్యాగుల్లో పాముల స్మగ్లింగ్..ఖంగుతిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పాముల స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది.

By Knakam Karthik  Published on  23 Feb 2025 3:58 PM IST
Natonal News, Delhi, IndiraGandi InterNational Airport, Wildlife Smuggling, Customs

లగేజీ బ్యాగుల్లో పాముల స్మగ్లింగ్..ఖంగుతిన్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు 

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పాముల స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ బ్యాగుల్లో 23 విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వారు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారి లగేజీని తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో అనేక రకాలు పాములు, కీటకాలు లభ్యమవడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 303 ద్వారా బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అధికారులు ఆపి తనిఖీ చేయగా.. వారి బ్యాగుల్లో అనేక అరుదైన విదేశీ జంతువులు ఉన్నట్లు బయటపడింది. దీనిపై కస్టమ్ శాఖ అత్యంత సీరియస్‌గా స్పందించి, అక్రమంగా తీసుకువస్తున్న ఈ అటవీ జీవాలను స్వాధీనం చేసుకుంది. వారి బ్యాగ్ ల తనిఖీ అనంతరం వివిధ రకాల పాములు, కీటకాలు లభ్యమయ్యాయి.

స్వాధీనం చేసుకున్న వాటిలో 5 కార్న్ పాములు, 8 మిల్క్ పాములు , 9 బాల్ పైథాన్ పాములు, 4 బియర్డెడ్ డ్రాగన్ చిపకిళ్లు, 7 క్రెస్టెడ్ గెకో చిపకిళ్లు, 11 కామెరూన్ డ్వార్ఫ్ గెకో, మరో 14 కీటకాలు, ఒక పెద్ద సాలీడు కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అరుదైన అటవీ జీవాలను సంబంధిత అటవీ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటువంటి అక్రమ రవాణా ప్రయత్నాలు గతంలో కూడా నమోదయ్యాయి. చాలా సార్లు బంగారం అక్రమ రవాణా, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి సంఘటనలు వెలుగుచూశాయి. తాజా ఘటనలో అరుదైన అటవీ జీవాలను అక్రమంగా దేశంలోకి తేనికొని వచ్చిన ఈ ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

Next Story