ప్రేమికుల రోజున, ప్రవిజ తన కాలేయాన్ని తన భర్త సుబీష్‌కు దానం చేసి, అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. కేరళలోని కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగింది. శస్త్రచికిత్స 17 గంటల పాటు కొనసాగింది. నివేదికల ప్రకారం.. కేరళలోని ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది రెండవ విజయవంతమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స, కొట్టాయం ఎమ్‌సీహెచ్‌లో మొట్టమొదటిది. సుబీష్, ప్రవిజ స్వస్థలం కున్నంకులం. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శస్త్రచికిత్స 17 గంటల పాటు కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు మొదటి దశ పూర్తయింది.
ప్రవిజ కాలేయం ఎడమవైపు 40 శాతం మొదట తొలగించారు. సాయంత్రం 5.30 గంటలకు సుబీష్ శరీరంపై ప్రవిజ కాలేయం భాగాన్ని కుట్టించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మరో ఐదు గంటలపాటు కొనసాగింది. ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ టీకే జయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు శస్త్ర చికిత్స పూర్తయిందని, ఒక గంట పరిశీలన అనంతరం సుబీష్‌ను వెంటిలేటర్‌కు తరలించామని తెలిపారు. రాబోయే 48 గంటలు అతనికి కీలకమని తెలిపారు. సుబీష్ గత కొన్నేళ్లుగా కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.