మరో కొత్త వ్యాధి.. బ్లాక్ కాదు ఇప్పుడు వైట్ ఫంగస్

White Fungus knocked in Bihar.వైట్ ఫంగ‌స్‌. తాజాగా దీన్ని బీహార్ రాజ‌ధాని పాట్నాలో గుర్తించారు. నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయినట్లు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ఎన్‌ సింగ్ తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 7:27 AM GMT
white fungus

క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌ముందే.. బ్లాక్ ఫంగ‌స్‌(మ్యుకోర్ మైకోసిస్‌) టెన్ష‌న్ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్లాక్ ఫంగ‌స్‌తో పోరాడుతున్న భార‌త్‌కు మ‌రో ముప్పు పొంచి ఉంది. ఇది బ్లాక్ ఫంగ‌స్ కంటే ప్రాణాంత‌క‌మ‌ని నిపుణులు బావిస్తున్నారు. అదే వైట్ ఫంగ‌స్‌. తాజాగా దీన్ని బీహార్ రాజ‌ధాని పాట్నాలో గుర్తించారు. నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయినట్లు పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ఎన్‌ సింగ్ తెలిపారు.

వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతిస్తుందన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదముందని వెల్ల‌డించారు. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రమాదమేమీ లేదన్నారు. అయితే.. ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తోందని.. కానీ వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోందని చెప్పారు.

నలుగురు రోగులకు కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయి. కానీ వారు కరోనాతో కాకుండా తెల్లటి ఫంగస్ బారిన పడ్డారని తెలిపారు. రోగులలో మూడు కరోనా టెస్ట్ లు.. రాపిడ్ యాంటిజెన్, రాపిడ్ యాంటీబాడీ మరియు ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు నెగటివ్ గా ఉన్నాయని అన్నారు. ఈసారి మ్యూకస్ కల్చర్‌ను పరీక్షించగా వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు ఉన్నట్లు తేలడంతో వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం వారు కోలుకుంటున్నారని ఎన్‌సింగ్ తెలిపారు.

ఓ వైపు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ బ్లాక్ ఫంగ‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి త‌రుణంలోనే వైట్ ఫంగ‌స్ వెలుగు చూడ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.
Next Story
Share it