వాట్సాప్ గ్రూప్ సభ్యులు ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లయితే.. దానికి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ బాధ్యత వహించలేరని కేరళ హైకోర్టు బుధవారం ఒక ప్రధాన నిర్ణయంలో తీర్పునిచ్చింది. న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ ఈ తీర్పును వెలువరించారు. క్రిమినల్ చట్టంలో పరోక్ష బాధ్యత అనేది శాసనం నిర్దేశించినప్పుడు మాత్రమే వర్తిస్తుందన్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. పిటిషనర్ 'ఫ్రెండ్స్' అనే వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. ఈ గ్రూప్‌లో అతడితో పాటు మరో ఇద్దరు అడ్మిన్‌లు ఉండగా.. వారిలో ఒకరు ఈ కేసులో మొదటి నిందితుడు.
మార్చి 2020లో మొదటి నిందితుడు గ్రూప్‌లో చైల్డ్ పోర్న్ పోస్ట్ చేశాడు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 బి(ఎ, బి, డి), పోక్సో చట్టంలోని సెక్షన్ 13, 14, 15 ఆధారంగా గ్రూప్ అడ్మిన్‌లపై కేసు నమోదు చేయబడింది. పిటిషనర్ గ్రూపును సృష్టించినప్పటి నుంచి రెండో ముద్దాయిగా ఉన్నారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. "వాట్సాప్ గ్రూప్ అడ్మిన్, దాని సభ్యుల మధ్య మాస్టర్-సర్వెంట్ లేదా ప్రిన్సిపల్-ఏజెంట్ సంబంధం లేదు. గ్రూప్ మెంబర్ ప్రచురించిన పోస్ట్‌కి అడ్మిన్‌ను బాధ్యులుగా ఉంచడం క్రిమినల్ చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం" అని కోర్టు పేర్కొంది.