ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసి వచ్చిన అనంతరం రావత్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ బేబిరాణి మౌర్యకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో రావత్ వైదొలిగారు.
త్రివేంద్రసింగ్ రావత్‌పై అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై అసమ్మతి ప్రకటించడంతో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్‌సింగ్, ఉత్తరాఖండ్ ఇన్‌చార్జి దుష్యంత్ గౌతమ్‌లతో కూడిన కమిటీ.. ఆ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. సీఎంను మారుస్తామన్న హామీతో వారిని శాంతింపజేసింది. ఇదిలావుంటే.. ఈ నెల 17వ తేదీతో రావత్ సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకోనున్నారు. అయితే అధికారాన్ని చేపట్టిన నాటినుంచే ఆయనపై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయనను తప్పించారని తెలుస్తోంది.
అయితే.. ఉత్తరాఖండ్ సీఎం ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవిని ఎవరు వరించనుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే సీఎం రేసులో బీజేపీ ఎమ్మెల్యే ధన్ సింగ్ రావత్ ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ధన్ సింగ్ రావత్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ మంత్రిగా కొనసాగుతున్నారు. ధన్ సింగ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు అజయ్‌భట్, అనిల్ బలూని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్డీ తివారీ (కాంగ్రెస్) మినహా ఏ సీఎం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోలేదు. అయితే.. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా త్రివేంద్రసింగ్ రావత్ కొనసాగుతారు.