పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23న జరగనున్న మొదటి విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీగా మోహరించిన కేంద్ర బలగాలకు అదనంగా, ఇతర రాష్ట్రాల నుండి మరో 3,000 మంది సాయుధ పోలీసులను రంగంలోకి దించుతోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈ అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 13 నుండి విడతల వారీగా ఈ పోలీసులు బెంగాల్‌కు చేరుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపుకు ఈసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరోవైపు, తమిళనాడులో పోలీస్ అబ్జర్వర్‌గా నియమితులైన కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ సుప్రతీమ్ సర్కార్ విజ్ఞప్తిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా, ఈసీ దాన్ని తోసిపుచ్చుతూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. తిరునెల్వేలి, అంబసముద్రం వంటి కీలక నియోజకవర్గాలకు ఆయన అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది.