బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ఏడుగురు మృతి

పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది.

By Srikanth Gundamalla
Published on : 27 Aug 2023 12:45 PM IST

West Bengal, Blast, fire Cracker Factory, 7 Dead,

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ఏడుగురు మృతి

పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసి.. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

పశ్చిమబెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. దాంతో.. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసే సరికి మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక వారు కూడా త్వరగా ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేశారు. కానీ.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఇక బాణాసంచా ఫ్యాక్టరీ ఇళ్ల మధ్యలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడు సంభవించిన కారణంగా దగ్గరగా ఉన్న పలు ఇళ్లు ధ్వంసం అయినట్లు.. పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. బాణాసంచా తయారీ కేంద్రాలను ఇళ్ల మధ్యలో ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story