ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్‌కి వెలుతారు. అయితే.. పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే ఏం చేయాలి..? అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లా పరిధిలోని పోలీసులకు ఎదురైంది. పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన ఓ దొంగ తుపాకీతో పాటు పోలీస్ యూనిఫాం కూడా ఎత్తుకుపోయాడు. అంతేకాదండోయ్ పది కాట్రిజ్‌లను కూడా దొంగిలించాడు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్‌లోని న్యూ ఆజాద్ నగర్‌లోని బిద్ను అవుట్‌పోస్ట్‌లో దొంగతనం జరిగింది. బుధవారం అర్థరాత్రి దొంగలు పోస్ట్‌లో ఉన్న పెట్టెను అపహరించుకు పోయారు. చోరీ జరిగిన విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. గురువారం ఉదయం జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫోరెన్సిక్ బృందాన్ని వెంటనే సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ దొంగతనం సమయంలో, అవుట్‌పోస్ట్‌లో ఉన్న అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ సుధాకర్ పాండే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్పీ తేజ్ స్వరూప్ సింగ్ ఆయన్ను సస్పెండ్ చేశారు.
"పోలీస్ స్టేషన్ అవుట్‌పోస్ట్‌లో దొంగతనం సంఘటన జరిగింది. ప్రభుత్వ పిస్టల్ మరియు 10 కాట్రిడ్జ్‌లు లేవు. ఆ సమయంలో ఎస్‌ఐ ఔట్‌పోస్ట్‌లోనే ఉన్నారు. కేసు నమోదు చేయబడింది. నిందితులను పట్టుకోవడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశాం." అని ఎస్పీ తేజ్ స్వరూప్ సింగ్ తెలిపారు.