సన్యాసులగా మారమని మేం ఎవరికీ చెప్పలేదు: ఈషా ఫౌండేషన్
ఆధ్మాత్మికం, యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆశయంతో మాత్రమే జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్‌ను నెలకొల్పారని పేర్కొంది.
By అంజి Published on 2 Oct 2024 7:06 AM GMTసన్యాసులగా మారమని మేం ఎవరికీ చెప్పలేదు: ఈషా
కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈషా యోగా కేంద్రం నుంచి తమ కుమార్తెలను బయటకు రానివ్వడం లేదంటూ మద్రాసు హైకోర్టులో విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈశా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆధ్మాత్మికం, యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆశయంతో మాత్రమే జగ్గీ వాసుదేవ్ ఈషా ఫౌండేషన్‌ను నెలకొల్పారని పేర్కొంది. ఎవరి మార్గాలను వారు ఎంచుకునే వ్యక్తిగత స్వేచ్ఛ యువతకు ఉందని ప్రకటన చేసింది.
తమిళనాడు వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసిన ఎస్.కామరాజ్(69) తన ఇద్దరు కుమార్తెల(42, 39)ను ఈష ఫౌండేషన్ నుంచి విడిపించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టుకు హాజరైన ఇద్దరు కుమార్తెలు తాము ఇష్ట పూర్తిగానే సన్యాసి జీవితాన్ని ఎంచుకున్నామని చెప్పారు. వారిని పలు ప్రశ్నలు అడిగిన కోర్టు ఈ అంశంపై మరింత దర్యాప్తు జరపాలని నిర్ణయించింది.
''ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని భావిస్తున్న మీకు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం పాపంగా కనబడటం లేదా?'' అని కోర్టు పిటిషన్ దారుడి కుమార్తెలను అడిగింది. అలాగే ఈషా ఫౌండేషన్‌పై కేసుల ప్రస్తుత పరిస్థితి మీద నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.