చెన్నై చేరుకోనున్న చిన్నమ్మ
vk Shashi Kala entering into Chennai after 4 years.అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైలో అడుగుపెట్టడంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 8 Feb 2021 2:04 PM IST
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైలో అడుగుపెట్టడంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంకొద్ది గంటల్లో శశికళ చెన్నైలో అడుగుపెట్టనున్నారు.
బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్ క్లబ్ నుంచి శశికళ కారులో తమిళనాడుకు బయలుదేరారు. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చిన్నమ్మ కొన్నిరోజుల పాటు ప్రెస్టీజ్ గోల్ఫ్‌షైర్ క్లబ్ లో విశ్రాంతి తీసుకున్నారు. ఆమె అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్తున్న సమయంలో తమిళనాడులో ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఆమె బయలుదేరుతోన్న సమయంలోనూ ఆమెను చూసేందుకు చాలా మంది తరలి వచ్చారు. ఆమె జయలలిత ఫొటోముందు నివాళులు అర్పించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఆమె విడుదల కావడం, నాలుగేళ్ల తర్వాత తిరిగి తమిళనాడుకు వెళ్తుండడం పట్ల ఉత్కంఠ నెలకొంది. శశికళ రానుండడంతో చెన్నైలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులను కాపలాగా ఉంచారు.
అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు శశికళతో సంప్రదింపులు జరిపారని, వీరిలో కొందరు సీనియర్ మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అన్నాడీఎంకేలో సైతం ప్రకంపనలు వస్తున్నాయి. ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నేతలు సిద్ధమయ్యారు.