దేశంలో కోరోనా విరుచుకుపడుతోంది.. మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయినా సరే ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కోవిడ్ ఆంక్షలను బేఖాతర్ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
అలా నియమాలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఫైనులు వేయడం, రోడ్లపై ప్లాకార్డ్ లు పట్టుకొని నిలబెట్టడం, గుంజీలు తీయడం ఇలా రకరకాల శిక్షలు విధిస్తున్నారు. కొన్నిచోట్ల సోషల్ సర్వీస్ కూడా చేయిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వినూత్న పద్ధతిలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షిస్తోంది. నిబంధనలు లెక్కచేయకుండా అనవసరంగా బయటికి వచ్చిన వారితో అక్కడి పోలీసులు రామనామం రాయిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి చేతికి ఒక పెన్ను, పుస్తకం ఇచ్చి పేజీ నిండా రామ రామ అని రాయమంటున్నారు. మీకు మరీ అంతగా బోర్ కొట్టి ఇంట్లో కూర్చో లేకపోతే చక్కగా ఇలా రామనామం రాసిపుణ్యం సంపాదించుకోండి అని చెప్తున్నారు.
శిక్షించడం అనేదే శారీరకంగా ఇబ్బంది పెట్టడం కోసం కాదని తప్పు చేసిన వారి మనసు పై పని చేసి మరోసారి ఆ తప్పు చెయ్యకుండా ఉండేలా చేయాలంటున్నారు సాత్నా జిల్లా పోలీసులు. ప్రజలు స్వయం నియంత్రణ తో ఉన్నప్పుడు మాత్రమే కరోనా రక్కసి నుంచి కాపాడగలమని చెబుతున్నారు.