గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (64)కి కరోనా సోకింది. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో ఆయన వేదికపై హఠాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన పాల్గొనబోయే ఇతర బహిరంగ సభలను రద్దు చేశారు. సీఎం కుప్పకూలిపోవడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వైద్య సిబ్బంది ప్రథమ చిక్సిత చేసిన అనంతరం వెంటనే అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. అంతేకాదు రూపానీ 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.
ఇదిలావుంటే.. గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మునిసిపాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగి పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారు.
ప్రథమ చిక్సిత అనంతరం సీఎంను వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్‌లో తరలించామని.. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుసగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయ్ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీశారు.