ప్రారంభ‌మైన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. ఓటేసిన ప్ర‌ధాని మోదీ

Vice Presidential Elections 2022 PM Modi casts his vote at Parliament House.భారత దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు శనివారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 11:24 AM IST
ప్రారంభ‌మైన ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. ఓటేసిన ప్ర‌ధాని మోదీ

భారత దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో ఉదయం 10 గంటలకు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగుతోంది. పోలింగ్ ప్రారంభ‌మైన గంటలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జితేంద‌ర్ సింగ్‌, అశ్వినీ వైష్ణ‌వ్ లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10తో ముగియ‌నున్న నేప‌థ్యంలో నేడు ఎన్నిక జ‌రుగుతోంది. ఎన్టీఏ కూట‌మి త‌రుపున ప‌శ్చిమ బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మాజీ కేంద్ర మంత్రి, గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ అల్వా బ‌రిలో ఉన్నారు.

లోక్‌స‌భ‌కు చెందిన 543, రాజ్య‌స‌భ‌కు చెందిన 245 మంది ఈ ఎన్నిక‌లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. అయితే.. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో జ‌మ్ముక‌శ్మీర్ నుంచి 4, త్రిపుర 1, నామినేటెడ్ స‌భ్యుల నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 780 మంది ఓట్లు వేసే అవ‌కాశం ఉండ‌గా.. ఈ ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని తృణ‌ముల్ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. దీంతో 744 మంది ఓటింగ్ లో పాల్గొనున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు. ఈ నెల 11న‌ కొత్త ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

Next Story