జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వే.. భారీగా భద్రతా దళాల మోహరింపు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో భారత పురాతత్వ సర్వేక్షణ (ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా -ఏఎస్ఐ) సర్వే ప్రారంభమైంది.

By అంజి  Published on  24 July 2023 6:32 AM GMT
Varanasi, Archaeological Survey of India, ASI survey, Gnanavapi Masjid

జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వే.. భారీగా భద్రతా దళాల మోహరింపు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో భారత పురాతత్వ సర్వేక్షణ (ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా -ఏఎస్ఐ) సర్వే ప్రారంభమైంది. సోమవారం ఉదయం 30 మంది సభ్యులతో కూడిన అధికారుల బృందం సర్వే చేబట్టింది. ఒకప్పటి హిందూ ఆలయంపై ఈ మసీదు నిర్మించారా అన్న విషయాన్ని వీరు నిర్ధారించనున్నారు. సోమవారం ఉదయమే ఏఎస్‌ఐ బృందం మసీదు దగ్గరకు చేరుకుంది. సర్వే దృష్ట్యా, వారణాసిలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. మసీదు వెలుపల భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఇరు వర్గాల లాయర్లు కూడా సర్వేలో పాల్గొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదును శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేయాలని గత శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ అంజుమన్‌ ఇంతేజామియా మసీదు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిగింది. జ్ఞాన్‌వాపి మసీదు మేనేజ్‌మెంట్ కమిటీ తరఫున సీనియర్ లాయర్ హుజెఫా అహ్మదీ వాదనలు వినిపిస్తూ.. వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తక్షణమే స్టే విధించాలని కోరారు. ఏఎస్‌ఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. జ్ఞాన్‌వాపిలో కేవలం ఫోటోలు, వీడియోల ఆధారంగానే సర్వే చేస్తున్నారని, ఇప్పుడు ఎలాంటి తవ్వకాలు చేపట్టట్లేదని చెప్పారు. వారణాసి కోర్టు ఆదేశాల విషయంలో అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని మసీదు కమిటీకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.

ఆలయాన్ని కూల్చివేసి జ్ఞాన్‌వాపి మసీదును నిర్మించారా, లేదా అనే అంశాన్ని ఏఎస్‌ఐ సర్వే ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. హిందూ దేవాలయం మీద జ్ఞాన్‌వాపి మసీదును నిర్మించారని హిందువుల పక్షం వాదిస్తోంది. మసీదులో ఉన్న వజూఖానాను సర్వేలో చేర్చలేదు. ఇక్కడ శివలింగం ఉందని హిందువుల పక్షం వాదిస్తుండగా, అది ఫౌంటెన్ అని ముస్లింల పక్షం చెబుతోంది. ఈ అంశంపై ఆగస్టు 4 లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ రిపోర్టులో సర్వే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు కూడా చేర్చాల్సి ఉంటుంది.

Next Story