కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకువచ్చింది. గాంధీనగర్-ముంబై మధ్య నడిచే వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయంత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ముందు ప్యానెల్‌కు చిన్నపాటి డెంట్ ఏర్పడింది. ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రారంభించిన తరువాత ఇలా జరగడం ఇది నాలుగోసారి.
పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్వాడ మరియు వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో గురువారం సాయంత్రం 6.23 గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఒక చిన్న డెంట్ ఏర్పడింది. ఆ తరువాత డెంట్‌ను ఫిక్స్ చేశాం. కొద్ది సేపటి తరువాత సాయంత్రం 6.35 గంటలకు రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించిందని తెలిపారు.
రెండు నెలల క్రితం గాంధీనగర్-ముంబై మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఆరంభం అయ్యాయి. ఈ రెండు నెలల వ్యవధిలో నాలుగు సార్లు ట్రాక్‌పై వచ్చిన పశువులను రైలు ఢీ కొట్టింది. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్ లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రారంభించారు.