సోరంగంలో చిక్కుకున్న 40 మంది.. పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన దాదాపు 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

By అంజి  Published on  13 Nov 2023 10:00 AM IST
Uttarkashi, tunnel collapse, NDRF, Silkyara Tunnel

సోరంగంలో చిక్కుకున్న 40 మంది.. పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన దాదాపు 40 మంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సోరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నారని, వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశామని, సొరంగంలో నీటి సరఫరా కోసం వేసిన పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. అదే పైపు ద్వారా రాత్రిపూట కంప్రెసర్ ద్వారా ఒత్తిడిని సృష్టించి చిక్కుకున్న కార్మికులకు ఆహార పదార్థాలను సరఫరా చేశారు. మరోవైపు చెత్తాచెదారం తరలింపునకు భారీగా ఎక్స్‌కవేటర్‌ యంత్రాలను రంగంలోకి దించారు.

బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా - దండల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఒక భాగం ఆదివారం ఉదయం కూలిపోవడంతో కనీసం 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలంలో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఉత్తరకాశీ పోలీసు సూపరింటెండెంట్ అర్పన్ యదువంశీ తెలిపారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిపై అప్‌డేట్ పొందడానికి ఉత్తరకాశీ డిఎం రుహెలాతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని కోరారు. "నేను అక్కడికక్కడే అధికారులతో టచ్‌లో ఉన్నాను. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను. సహాయక చర్యలను వేగవంతం చేయాలని నేను వారిని కోరాను. ప్రతి ఒక్కరూ సురక్షితంగా రక్షించబడాలని నేను ప్రార్థిస్తున్నాను" అని ధమీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో తెలిపారు.

Next Story