ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..వరదలో 12 మంది గల్లంతు

గౌరీకుండ్‌ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. దాంతో అక్కడ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2023 12:48 PM IST
Uttarakhand, landslide, 12 people missing, Flood,

ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు..వరదలో 12 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వరదలు సంభవిస్తున్నాయి. పలు చోట్ల అయితే కొండ చరియలు విరిగిపడి ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులు మూతపడిపోతున్నాయి. రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కగౌరీకుండ్‌ ప్రాంతంలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో 12 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కురుస్తున్నాయి. శుక్రవారం కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లే గౌరీకుండ్‌ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. దాంతో అక్కడ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇళ్లు, పలు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరదల్లో పలువురు గల్లంతు అయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. సుమారు 12 మంది ఆచూకీ తెలియడం లేదని.. వారంతా గల్లంతు అయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందాలు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. కాగా.. కొండచరియలు విరిగిపడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేరని తెలుస్తోంది. ధ్వంసమైన ఇళ్లు, దుకాణాల్లోనూ ఎవరూ లేరని సమాచారం.

కానీ.. సంభవించిన వరదల్లో మాత్రం 12 మంది గల్లంతు అయినట్లు అధికారులు చెబుతున్నారు. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. గల్లంతైన వారిలో నేపాల్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు వాహనదారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గంగోత్రి జాతీయ రహదారితో పాటు, నంద్‌ప్రయాగ్ ప్రాంతంలో బద్రినాథ్‌ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రయాణాలకు అనుమతి ఇస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ రూట్లలో ప్రయాణం చేయాల్సిన వారు ఈ సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. అంతేకాక.. ఎడతెరిపిలేని భారీ వర్షాలు సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగిస్తోందని చెప్పారు.ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులు కోరారు.

Next Story