ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌ధామ్ దేవస్థానం బోర్డును మంగళవారం రద్దు చేసింది. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాత చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. 2019లో బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆలయాలపై తమ సంప్రదాయ హక్కులను ఉల్లంఘిస్తున్నారని చార్‌ధామ్ పూజారులు పేర్కొంటూ దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం బోర్డు సమస్యను పరిశీలించేందుకు సీఎం ధామి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం రిషికేశ్‌లో ముఖ్యమంత్రికి తన సిఫార్సులను సమర్పించింది.
"మేము మనోహర్ కాంత్ ధ్యాని నేతృత్వంలోని ప్యానెల్ సమర్పించిన నివేదిక వివరాలను పరిశీలించాము. సమస్య యొక్క అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మా ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది" అని సీఎం ధామి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో ఏర్పాటైన చార్‌ధామ్ దేవస్థానం బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 51 దేవాలయాల వ్యవహారాలను నిర్వహించింది. వీటిలో ప్రసిద్ధ హిమాలయ దేవాలయాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఉన్నాయి.