ఓ తల్లి తపన.. 25 మంది ప్రాణాలు కాపాడింది
Uttarakhand glacier burst a moms frantic calls to son saved about 25 lives.తన కొడుకు ప్రాణాలు ప్రమాదం పొంచి ఉందని ఆ తల్లి మనసు తల్లడింది. కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని అతడికి పదే పదే ఫోన్ చేసింది.
By తోట వంశీ కుమార్
తన కొడుకు ప్రాణాలు ప్రమాదం పొంచి ఉందని ఆ తల్లి మనసు తల్లడింది. కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని అతడికి పదే పదే ఫోన్ చేసింది. ఆమె పడిన తపన కారణంగా ఆమె కుమారుడితో పాటు మరో 24 మంది తమ ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఈనెల 7న ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో గ్లేసియర్ విరిగి పడి వచ్చిన ఆకస్మిక వరద ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో తెలుసు కదా. ఈ విషాదంలో ఇప్పటికే 40 మందికిపైగా మరణించారు. ఇంకా వంద మందికిపైగా జాడ తెలియడం లేదు. తపోవన్ పవర్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కొద్ది మంది తప్పించుకోగా అందులో విపుల్ కైరేనీ బృందం కూడా ఒకటి.
ఎన్టీపీసీ జల విద్యుత్ కేంద్రంలో విపుల్ కైరేనీ అనే 27 ఏళ్ల వ్యక్తి ఆ విలయం సంభవించిన రోజు అక్కడే పని చేస్తున్నాడు. అతడో డ్రైవర్. ఆదివారం సెలవు. ఆరోజు పనికి వెళితే రెట్టింపు కూలి వస్తుందని వెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో అతడు తన ఊరి నుంచి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లాడు. అయితే అతడు వెళ్లిన కాసేపటికే ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చింది. విపుల్ ఊరు చాలా ఎత్తున ఉంటుంది. దీంతో ఆ సమయంలో ఇంటి బయట పని చేస్తున్న అతని తల్లి మంగశ్రీ దేవి ముందుగానే ధౌలిగంగ ఉగ్రరూపాన్ని చూసింది. వెంటనే కుమారుడికి ఫోన్ చేసింది. అలా చాలా సార్లు కుమారుడికి ఫోను చేసింది. మొదట ఈ విషయాన్ని అతడు నమ్మలేదు. కానీ తల్లి పలుమార్లు ఫోన్ చేయడంతో.. తన సహచరులతో కలిసి తాను ప్రాజెక్ట్ మెట్లపైకి ఎక్కినట్లు విపుల్ చెప్పాడు. దీంతో అతనితోపాటు మరో 24 మంది ఆ భయానక వరద నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
'మా గ్రామం కొండ ప్రాంతంలో ఉంటుంది. నా తల్లి ఇంటి బయట పనిచేస్తుండగా.. దౌలిగంగ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ముందుకొస్తున్నట్లు గుర్తించి నాకు ఫోన్ చేసింది. కానీ నేను ఆ విషయాన్ని మొదట నమ్మలేదు. ఆమె పదేపదే ఫోన్ చేయడంతో నేను, నాతో పాటు మరో 24 మంది విద్యుత్కేంద్రంలోని ఎత్తయిన ప్రాంతంలో ఉన్న మెట్లపైకి చేరుకుని మా ప్రాణాలు కాపాడుకున్నాం. నా తల్లి ఫోన్ చేయకపోయుంటే నేను, నా తోటి వారు మృతి చెంది ఉండే వాళ్లం' అని విపుల్ కైరేని తెలిపాడు. ప్రాణాలతో బయటపడిని మిగతావారు కూడా ఆ తల్లికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు.