ఉత్తరాఖండ్ లో హిమానినదాల బీభత్సమ్
Uttarakhand Glacier Burst.ఉత్తరాఖండ్ లో మరోసారి మంచు చరియలు విరిగిపడ్డాయి. చమోలి జిల్లాలోని సమ్న వద్ద హిమనీ నదాలు ముంచెత్తాయి.
By తోట వంశీ కుమార్ Published on 25 April 2021 3:14 AM GMTఉత్తరాఖండ్ లో మరోసారి మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇండో చైనా సరిహద్దుల్లోని చమోలి జిల్లాలోని సమ్న వద్ద హిమనీ నదాలు ముంచెత్తాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోషిమఠ్ సెక్టార్ లోని సూర్య కమాండ్ ట్వీట్ తో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటికే ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్మీ, సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
దట్టంగా మంచు కురవడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. అయితే, చివరకు రెస్క్యూ సిబ్బంది దాదాపు 430 మంది కూలీలను రక్షించారు. ప్రస్తుతం భాప్ కుంద్ నుంచి సమనా మధ్య రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచు కరిగి.. మంచు చరియలు విరిగిపడి ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ముంచుచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.చుట్టుపక్కల గ్రామాలు మరియు పశువులకు ఎటువంటి నష్టం జరగలేదని,రోడ్లు మాత్రమే దెబ్బతిన్నాయన్నారు.
గతంలో ఫిబ్రవరిలో, చమోలి జిల్లాలోని జోషిమత్ వద్ద మంచు చరియలు విరిగి.. గంగ ఉప్పొంగి.. విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన ఘటనలో 200 మంది దాకా చనిపోయిన సంగతి తెలిసిందే.ఈ వరద రెండు రాష్ట్ర హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను తుడిచిపెట్టేసింది. ఆ ఘటన జరిగిన కొన్ని నెలలకే అదే ప్రాంతంలో తాజాగా ఈ ప్రమాదం జరిగింది.