ఉత్తరాఖాండ్ లో విషాదం చోటు చేసుకుంది.. ఇక్కడ వరదలు ముంచెత్తుతున్నాయి. ఛమోలీ జిల్లాలోని తపోవన్ ఏరియాలో ధోలీగంగా నదిలో కొండచరియలు విరిగిపడటంతో.. వరద ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. దాంతో రైనీ అనే గ్రామం దగ్గర ఉన్న రిషిగంగా పవర్ ప్రాజెక్ట్ కు నష్టం వాటిల్లింది. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇప్పటికే ధోలీగంగా నది వెంబడి ఉన్న గ్రామాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంచు చెరియలు విరిగిపడటంతో ధౌలిగంగా నది ముంచెత్తి గల్లంతైన వారిలో ఇప్పటి వరకూ 10 మృతదేహాలు లభ్యమయ్యాయి.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మనసు చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం చోటు చేసుకున్న మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు గాను ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. పీఎం సహాయ నిధి నుంచి మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప్రకటించారు.
ఉత్తరాఖండ్లో సహాయక చర్యల కోసం మూడు కంపెనీల ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెండు సూపర్ హెర్క్యులస్ విమానాలను పంపించారు అధికారులు. వారితో పాటు 15 టన్నుల సహాయక పరికరాలను ఘజియాబాద్ హిందాన్ ఎయిర్బేస్ నుంచి పంపించారు. సైన్యం పరంగా సహాయకచర్యలను త్రిదళాధిపతి బిపిన్ రావత్ పర్యవేక్షిస్తున్నారు.