వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తగ్గేదే లేదంటున్న ఉత్తరాఖండ్ సీఎం
Uttarakhand CM Tirath Singh Rawat. ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేస్తున్న వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి కొత్త తలనొప్పులు
By Medi Samrat Published on 22 March 2021 6:38 AM GMTఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేస్తున్న వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకుని వస్తూ ఉన్నాయి. ఆయన ఇటీవలే మహిళల చిరిగిపోయిన జీన్స్ మీద చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. పలు మహిళలు చిరిగిపోయిన జీన్స్ తో కనిపిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడమే కాకుండా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆయనను తిడుతూ ఉండడంతో దిగొచ్చిన ఆయన క్షమాపణ తెలిపారు. మహిళలు జీన్స్ ధరించడం అభ్యంతరం లేదంటూనే చిరిగిన వాటిని ధరించడం సరైంది కాదని చెప్పారు.
ఇప్పుడు తీరత్ సింగ్ రావత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను 200 ఏండ్లు అమెరికా పాలించిందని, భారతీయులను బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు అమెరికా కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని అనడం కలకలం రేపుతోంది. రవి అస్తమించని రాజ్యంగానూ పేరుపొందిన అమెరికా ఇవాళ కొవిడ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిందంటూ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ను అమెరికా పాలించడం ఏమిటా అని మీకు కూడా డౌట్ రావచ్చు కదా.. బ్రిటన్ అని చెప్పడానికి వెళ్లి.. అమెరికా అనేశారు ఆయన. స్వయంగా ముఖ్యమంత్రికి బ్రిటన్‌కు అమెరికాకు తేడా తెలియదా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రపంచంలోని చాలా దేశాలను పాలించిన అమెరికా ప్రస్తుతం కరోనాను అదుపు చేయడంలో తలలు పట్టుకుంటోందని తీరత్ సింగ్ రావత్ విమర్శించారు. భారత్‌తో పోల్చితే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 50 లక్షల వరకు చేరిందని.. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని అమెరికా ప్రభుత్వం మరొకసారి లాక్‌డౌన్ విధించే యోచన చేస్తోందని అన్నారు. ప్రస్తుత సమయంలో నరేంద్ర మోదీ తప్ప ఈ దేశానికి మరెవరైనా ప్రధాని అయి ఉంటే, భారత్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేదని చెప్పుకొచ్చారు.