ఘోర ప్రమాదం: చెరువులో పడిన ట్రాక్టర్, 15 మంది దుర్మరణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 1:15 PM IST
uttar pradesh, tractor, accident, 15 people died,

ఘోర ప్రమాదం: చెరువులో పడిన ట్రాక్టర్, 15 మంది దుర్మరణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మాఘ పూర్ణిమ సందర్బంగా కొందరు గంగా నదిలో స్నానాల కోసం ఒక ట్రాక్టర్‌లో బయలుదేరారు. అయితే.. వీరి యాత్ర విషాదాంతంగా ముగిసింది. కాస్గంజ్‌ జిల్లాలో రోడ్డుమీద ఎదురుగా ఉన్న కారును తప్పించబోయి ట్రాక్టర్‌ రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నీట మునిగి 15 మంది చనిపోయారు. ఈ సంఘటనపై ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పలువురు నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.

కాగా.. కాస్గంజ్‌ జిల్లాలో జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంపై ఆలిగఢ్‌ ఐజీ షలభ్ మాథూర్ స్పందించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ చెరువులో పడిపోయిన దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అయితే.. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండగా.. ఏడుగురు మహిళలు ఉన్నట్లు ఐజీ తెలిపారు. రోడ్డుపై ఉన్న కారును తప్పించబోయి ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకెళ్లిందనీ చెప్పారు. అయితే.. ట్రాక్టర్‌ చెరువులో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడకు వెళ్లి పరిస్థితి సమీక్షించారనీ ఐజీ తెలిపారు. చెరువులో దిగిన స్థానికులు మానవహారాన్ని ఏర్పాటు చేసి గాయపడ్డవారిని, మృతదేహాలను బయటకు తీశారు. ట్రాక్టర్‌ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్రాక్టర్‌ ప్రమాదంపై ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ ప్రమాదంలో 15 మంది చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు యోగి ఆదిత్యనాథ్. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక సమీప అధికారులు కూడా వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

Next Story